దేశ సరిహద్దు మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠాకు చెందిన ఆరుగురు తీవ్రవాదులు చనిపోగా.. ఎదురుకాల్పుల్లో భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో వీరమరణం పొందాడు. ఒక భారత జవాను గాయపడ్డాడు. చనిపోయిన ఉగ్రవాదుల్లో ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ మేనల్లుడు ఓవైద్ కూడా ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. బందిపోర జిల్లా హజిన్ ప్రాంతంలో చందర్గీర్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత భద్రతా దళానికి సమాచారం అందింది. వెంటనే బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ముమ్మరంగా గాలిస్తున్న తరుణంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. భారత దళాలు కూడా వారిపై కాల్పుల మోత మోగించారు. ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఎస్.పి.వెయిద్ తెలిపారు. వీరంతా పాకిస్థాన్ కు చెందినవారేనని, అందులో ఒకరు లఖ్వీ మేనల్లుడు ఓవైద్ కూడా ఉన్నారని వివరించారు. సంఘటన స్థలం నుంచి భద్రతా దళాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా శ్రీనగర్లోని పలుప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు.
కాశ్మీర్ లో ఉగ్రవాదులు హతం