రవిశాస్త్రిని మారిస్తే, టీమిండియా దెబ్బ తింటుందా ?

రవిశాస్త్రిని మారిస్తే, టీమిండియా దెబ్బ తింటుందా ?

Last Updated : Jul 27, 2019, 12:40 AM IST
రవిశాస్త్రిని మారిస్తే, టీమిండియా దెబ్బ తింటుందా ?

ముంబై: టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో అతడి స్థానంలో మరో కోచ్‌ని నియమించేందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించిన బీసీసీఐ.. ఆఖరికి అతడిని మార్చితే ఆ ప్రభావం టీమిండియాపై పడుతుందా అనే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. బీసీసీఐ నియమనిబంధనల ప్రకారం రవిశాస్త్రితో కాంట్రాక్టు ముగిసిన నేపథ్యంలో అతడిని ఆ స్థానం నుంచి తప్పించి కొత్త వారిని నియమించాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లతో రవిశాస్త్రికి ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆ పరిణామం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోనని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీకి రవిశాస్త్రికి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ఈ ఇద్దరూ కలిసి మంచి విజయాలు సాధించారని చెబుతూ బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. 

2020లో జరగనున్న టీ20 ప్రపంచ కప్, 2023 ప్రపంచ కప్‌ల నాటికి భారత జట్టును మరింత దృఢంగా తీర్చిదిద్దాలంటే రవిశాస్త్రిని కొనసాగించడమే ఉత్తమమని సదరు అధికారి అభిప్రాయపడ్డారు. రవిశాస్త్రి చీఫ్ కోచ్ పదవిలో కొనసాగం సంగతి అటుంచితే, ఇప్పటికే బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించిన అనంతరం శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే చీఫ్ కోచ్ పదవికి, దక్షిణాఫ్రికా దిగ్గజ ఫీల్డర్ జాంటీరోడ్స్ ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కపిల్ దేవ్ నేతృత్వంలోని సీఓసి (క్రికెట్ అడ్వైజరీ కమిటి) ఆగస్టు నెలలో టీమిండియాకు కోచ్‌ని ఎంచుకోనున్న నేపథ్యంలో రవిశాస్త్రిని కొనసాగించాలా లేదా అనే అంశంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్న వైనం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది.

Trending News