తిరుమల: ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుమలకు రానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కొలంబో నుంచి ప్రధాని మోదీ తిరుపతికి చేరుకోనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తిరుమలకు వస్తున్న నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికేందుకు నేడు సాయంత్రం తిరుమల రానున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ తిరుపతి ప్రధాన రహదారులు, తిరుమల వీధుల్లో భారీ సంఖ్యలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధాని రాక నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని విశ్రాంతి తీసుకోనున్న పద్మావతి అతిథి గృహాన్ని ఇప్పటికే ప్రధాని భద్రతా దళం ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. పద్మావతి అతిథి గృహానికి చుట్టుపక్కల వున్న అతిథి గృహాలను సాధారణ భక్తులు, పర్యాటకులకు కేటాయించడాన్ని నిలిపేశారు. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
ప్రధాని మోదీ తిరుమల చేరుకున్న అనంతరం వెంటనే బీజేపి నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. ప్రధానితోపాటే గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రాత్రి 8:15 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
నేడు తిరుమలకు ప్రధాని.. స్వాగతం పలకనున్న గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్