విజయంపై ఎవరికి వారు ధీమా ..ఇంతకీ గెలుపు ఎవరిది ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి.ఇప్పుడు చర్చ అంతా గెలుపుపైనే..ఇంతకీ ఎన్నికల యుద్ధంలో ఎవరు పై చేయి సాధించారు ?

Last Updated : Apr 12, 2019, 01:40 PM IST
విజయంపై ఎవరికి వారు ధీమా ..ఇంతకీ గెలుపు ఎవరిది ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఉత్కంఠ భరిత రీతిలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.  ఈ క్రమంలో ఎవరికి వారు తామే గెలుస్తామని టీడీపీ, వైసీపీలు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జనసేన తాము రేసులో ఉన్నామని చెబుతోంది. ఇలాంటి వాతావరణంలో గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై ఉత్కంఠత నెలకొంది.
 

మళ్లీ అధికారంపై చంద్రబాబు ధీమా  !!
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . మొత్తం 175 స్థానాలకు గాను 130 స్థానాలు తగ్గకుండా గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ విషయంలో రెండో ఆలోచన అవసరం లేదని కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించారు.  అయితే ఫలితాలు వచ్చే వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచన చేశారు. టీడీపీ నేతలతో గురువారం అర్ధరాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ మేరకు స్పందించారు. ఇదే సందర్భంలో టీడీపీ శ్రేణుల్లో ఇదే తరహా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. 'పసుపు - కుంకుమ', పింఛన్ల పెంపు, అమరావతి, పోలవరం తదితరాలు తమకు అనుకూలమని టీడీపీ వాదిస్తోంది.

జన సునామీలో జగన్ గెలుపు తథ్యముంటున్న వైసీపీ
గత ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని వైసీపీ చీఫ్ జగన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో 140 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమాతో జగన్ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న కారణంగానే 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైందని వైసీపీ వాదిస్తోంది. పాదయాత్రతో ప్రజలకు చేరువకావడం, ప్రత్యేకహోదా అంశం, బీజేపీతో టీడీపీ నాలుగున్నరేళ్లు చెలిమి ఈ అంశాలన్నీ తమకు లాభిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

 

అధికారాన్ని డిసైడ్ చేసేది తామేనంటున్న జనసేన !!
ఇలా ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలూ ఘంటాపథంగా చెబుతుంటే..తామూ రేసులో ఉన్నామని  జనసేన వాదిస్తోంది. అధికారం చేపట్టకపోయినా జనసేన  కింగ్ మేకర్ గా అవతరిస్తుందనే ధీమాతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. అధికారంలోకి ఎవరు రావాలనేది జనసేన డిసైడ్ చేస్తుందని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి ఉత్కంఠ భరిత వాతావరణంలో గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ఈ ఉత్కంఠ వీడాలంటే మే 23న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే మరి.

Trending News