Ys Jagan Oath: ఏపీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా నిన్న అర్ధరాత్రి పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ ఓటింగుతో కలిగి 81.76 శాతంగా ఎన్నికల సంఘం తేల్చింది. అంటే 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటే దాదాపు 2 శాతం అధికం. ఇదే ఇప్పుడు రాజకీయంగా అనిశ్చితికి కారణమైంది. రెండు శిబిరాల్లోనూ ధీమా కన్పిస్తోంది. అధికారం మాదంటే మాదేనంటున్నాయి. కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన విన్పిస్తోంది.
కానీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయంపై చాలా ధీమాగా ఉంది. వైసీపీ నేతలు బొత్స మీడియా సమావేశం, ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ప్రకారం విశాఖపట్నంలో వైఎస్ జగన్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం తేదీ కూడా 2-3 రోజుల్లో ప్రకటిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఓటు పోలింగ్ సరళి, ఇటు కూటమిదే అదికారమనే వార్తలు ఎంతలా ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంపై చాలా ధీమాతో ఉంది. ఏకంగా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది. ఎన్నికల్లో విజయంపై అటు పార్టీలో ఇటు జగన్ ఇంతలా దీమాగా ఉండటానికి కారణాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పోలింగ్ ప్రారంభమైన తొలి మూడు గంటల్లోనే 24 శాతం పోలింగ్ నమోదు కావడం వెనుక వాలంటీర్లు గట్టిగా కష్టపడ్డారనేది పార్టీకు ఉన్నసమాచారం. ఏ ఇంట్లో ఏ ఓటరు ఉన్నాడనే సమాచారం వాలంటీర్లకు పూర్తిగా ఉంది. ఆ సమాచారం ఆధారంగా వాలంటీర్లు గ్రామాల్లో దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు ఉదయమే వారిని తరలించగలిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు బలమున్న గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ గట్టిగా జరిగింది. మరోవైపు మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున ఓటింగులో పాల్గొన్నారు. మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు నమ్మినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పధకాల లబ్దిదారులు కసితో ఓటింగులో పాల్గొనడం వల్లనే పోలింగ్ శాతం భారీగా పెరిగిందనేది పార్టీ వర్గాల అంచనా. ముఖ్యంగా బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పెద్దఎత్తున వైసీపీకు అనుకూలంగా ఓటేసినట్టు చెబుతున్నారు.
ఈ కారణాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా పెంచింది. అందుకే వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. అటు పార్టీ నేతలు కూడా 2-3 రోజుల్లో తేదీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచిందనేది పార్టీ వర్గాల ఆలోచనగా ఉంది. జూన్ 4న ఊహించని ఫలితాలు రానున్నాయని, రాజకీయాల్లో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Also read: AP Poll Percentage 2024: ఏపీలో రికార్డు స్థాయిలో 81.76 శాతం పోలింగ్, ఎవరి కొంపముంచనుందో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook