ఉద్యోగార్థులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠ వయోపరిమితిపై ఇచ్చిన నిర్ణయాన్ని మరోసారి కొనసాగించనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ మరోసారి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈమేరకు జీవో 132 విడుదల చేసింది ప్రభుత్వం. ఫలితంగా వయోపరిమితి ముగిసినవారు కూడా అవకాశాలు కోల్పోకుండా రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ వయోపరిమితి పెంపు డీఎస్సీ, ఎపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు వర్తించనుంది.
ఈ వయోపరిమితి 2029 సెప్టెంబర్ 30 వరకు వర్తించనుంది. కాగా గతంలో వయోపరిమితిని పెంచుతూ గతంలో ఇచ్చిన జీవో గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. పాత జీవో గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం సవరణ చేస్తూ కొత్త ఆదేశాలు ఇచ్చింది.
ఈ జీవో ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా అన్ని నియామక ఏజెన్సీలకు చెందిన పరీక్షలకు ఈ పెంపు నిర్ణయం వర్తిస్తుంది. విడుదలయ్యే నోటిఫికేషన్లకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్నది. ఈ క్రమంలో డైరెక్టు రిక్రూట్‌మెంట్ విధానంలో అర్హులైన విద్యావంతులను ఎంపిక చేసేందుకు ఏపీపీఎస్‌స్సీతోపాటు ఇతర సెలక్షన్ కమిటీలకు ఖాళీల వివరాలను అందజేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వయోపరిమితి సడలించాలనే ప్రతిపాదనలు అందాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పెంపు స్టేట్, సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌కు వర్తిస్తుంది.
సెప్టెంబర్ 30తో గడువు ముగిసిపోవడంతో ఉద్యోగాలను ఆశిస్తున్న నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యారు. మరిన్ని ఉద్యోగాలు భర్తీచేసేవరకు తమకు అవకాశమివ్వాలని వారు కోరారు. పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వారికి ఊరటనిచ్చేలా వయోపరిమితి సడలింపు నిర్ణయాన్ని ప్రకటించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 42 యేళ్లకు పెంచుతూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు 34 ఏళ్ల వయోపరిమితి ఉండగా, దాన్ని మరో 8 ఏళ్లకు పెంచింది.
త్వరలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో మరోసారి వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
డీఎస్సీ సహా 18 వేల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిలో ఆరు వేల పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ నెలాఖరులో రిక్రూట్‌మెంట్ కేలెండర్‌ను విడుదల చేయనున్నారు. టీచర్లు, పోలీసు ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని పోస్టులను కమిషన్ భర్తీ చేస్తుందని ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ అన్నారు. వివిధ కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు 30 నుంచి 40 వరకు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
ఉద్యోగార్థులకు భారీ ఊరటనిచ్చిన ప్రభుత్వం!