హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గురువారం లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఈ విషయమై స్పందించిన విజయశాంతి.. ఎన్డీఏకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు సరైందో, కాదో కాలమే నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఫలితాల వెల్లడి సందర్భంగా పార్టీలకు అతీతంగా విజయం సాధించిన విజేతలను అందరినీ అభినందిస్తున్నానని స్పష్టంచేసిన విజయశాంతి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన ఓటర్లు, ప్రజలు, మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తమ ఉనికిని చాటుకుంది. ఈ విజయంతో తెలంగాణలో మనుగడే కష్టం అనుకున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కొత్తగా ఊపిరి పోసినట్టయింది.