కర్ణాటకలో తన రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పాలకులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రోజు రోజుకీ అవినీతిమయం అవుతుందని తెలిపారు. కల్బుర్గి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్రలో మోదీ మాట్లాడుతూ "కాంగ్రెస్ నాయకులకు భారత సైనికులంటే గౌరవం లేదు.
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు వాటి వివరాలను బహిర్గతం చేయడమంటే.. దేశ భద్రతకు భంగం కలిగించినట్టే. కానీ వాటికి కూడా సిగ్గులేని కాంగ్రెస్ ఆధారాలు చూపించమంది. అలాగే మన సైనికదళాలు గౌరవించదగ్గ వీరులు ఫీల్డ్ మార్షల్ కరియప్ప, జనరల్ తిమ్మయ్యలను కూడా కాంగ్రెస్ అవమానించింది. అలాగే మన సైనికాధ్యక్షుడిని "గూండా" అని కాంగ్రెస్ పేర్కొంది" అని మోదీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.
అలాగే కాంగ్రెస్ కర్ణాటకలో చేనేత పరిశ్రమకు చేసిన మేలేమీ లేదని, తమ ప్రభుత్వమే కొత్త విధానాలు తీసుకువచ్చిందని మోదీ అన్నారు. అలాగే తమ ప్రభుత్వం కులాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఓబీసీ కమీషన్ తీసుకురావాలని భావిస్తే... కాంగ్రెస్ అడ్డుకట్ట వేసిందని కూడా మోదీ అన్నారు. బీజేపీ దళితులకు, ముస్లిములకు పెద్దపీట వేస్తుందని కూడా మోదీ అన్నారు.
తమకు అవకాశం వచ్చినప్పుడు ఏపీజే అబ్దుల్ కలామ్ని రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని.. అలాగే ఆ తర్వాత దళితుడైన రామనాథ్ కోవింద్ రాష్ట్రపతి అవ్వడానికి కూడా పాటుపడ్డామని మోదీ పేర్కొన్నారు.అయితే కాంగ్రెస్ నిజలింగప్ప విషయంలో దారుణంగా ప్రవర్తించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీని మహిళా విరోధి అంటుందని.. కానీ ఒక మహిళకు రక్షణ మంత్రి పదవిని కట్టబెట్టిన ఘనత బీజేపీదేనని మోదీ అభిప్రాయపడ్డారు. కర్ణాటక రోజు రోజుకీ అవినీతిమయం అవుతుందని.. దీనిని సిద్ధరామయ్య సర్కారు అనే కన్నా.. సిద్ధరూపాయి సర్కారు అంటే బాగుంటుందని తెలిపారు