CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సారిగా పెద్ద ఎత్తున నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ నాలుగు స్కీమ్స్ ను అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ రైతు కూలీ భరోసా పథకాలు ఉన్నాయి. ఈ పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా చాలా స్కీమ్స్ అమలు చేయడం లేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ప్రభుత్వం గుర్తించింది. పథకాల అమలుకు వేల కోట్లు నిధులు అవసరం కావడంతో ప్రభుత్వం కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని ప్రభుత్వం పదే పదే చెబుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. దీని కారణంగా సంక్షేమ పథకాల అమలు ఆలస్యం అవుతుందని సర్కార్ అంటోంది.
ఇది ఇలా ఉండగా ప్రజల నుంచి రోజు రోజుకు వ్యతిరేకత వస్తుండడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక పథకాల అమలు వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి ప్రాధాన్యతలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ రైతు కూలీ భరోసా పథకాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. మొదటగా మండలంలోని ఒక్కో గ్రామానికి ఈ నాలుగు పథకాలు అమలు చేసింది. ఆయా గ్రామంలో ఈ నాలుగు స్కీమ్స్ ద్వారా అందరికీ లబ్ది చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.ఇలా అమలు చేయడంలో రాజకీయ వ్యూహం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒక గ్రామంలో లబ్దిదారులకు పథకాలు అందినప్పుడు వారి నుంచి ఎలా రియాక్షన్స్ వస్తాయో తెలుసుకోవడానికే ఇలా ప్లాన్ చేశారని హస్తం నేతలు అంటున్నారు.
సంక్షేమ పథకాలు అందుకున్న లబ్దిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందంట. ఇప్పటికే ప్రభుత్వ నిఘా వర్గాలు ఆయా గ్రామాల్లో లబ్దిదారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని టాక్. పథకాలు అందుకున్న వారిలో సంతోషంగా ఉన్నారా లేక ఇంకా ఏదైనా అసంతృప్తిలో ఉన్నారా ఉంటే ఆ అసంతృప్తికి కారణం ఏంటనే విషయాలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఏదైనా గ్రామంలో పథకాల అమలు తీరుపై నిరసనలు వ్యక్తం అయితుంటే దాని వెనుక ఎవరైనా ఉన్నారా లేక నిజంగా లబ్దిదారులే నిరసన వ్యక్తం చేస్తున్నారా అన్న విషయంపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.
నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పథకాల అమలును మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పథకాల అమలులో ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని మరింత పటిష్టంగా పథకాలను అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ సీక్రెట్ సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తుంది.ఎలాగైనా ఈ నాలుగు పథకాలను పక్కాగా అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను చక్కబెట్టుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుందంట.ఈ నాలుగు పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు జరిగితే రాజకీయంగా మరింత పట్టు సాధించవచ్చని కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది.
మరోపక్క రేవంత్ రెడ్డి చేయిస్తున్న సీక్రెట్ సర్వే వెనుక మరో కోణం ఉందనే వాదన కూడా వినిపిస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పై చేయి సాధించడానికే రేవంత్ ఈ వ్యూమం అమలు చేస్తున్నారని అంటున్నారు. ఈ నాలుగు పథకాలు కూడా డైరెక్ట్ గా ప్రజలకు అందితే రాజకీయంగా ఇక తిరుగు ఉండదని రేవంత్ రెడ్డి భావనగా తెలుస్తుంది. అందుకే ఈ పథకాలపై రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాల్లో రైతు భరసా మినహా మిగితా మూడు పథకాలు నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతుంది. అంటే రైతు భరసా ద్వారా రైతులందరికీ నగదు అకౌంట్లలో జమ అవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అందుకే వీలైనంత త్వరగా రైతుభరోసా నగదును రైతుల అకౌంట్లలో జమ చేయడానికి సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది.
మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నా సంక్షేమ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయట. రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా ప్రజల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రాజకీయంగా ఇబ్బందులు ఉండవు, అదే సమయంలో ప్రజల నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే మాత్రం రేవంత్ సర్కార్ కు ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి తప్పదు.
Also Read: Sara Tendulkar: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సచిన్ గారాల పట్టీ సారా టెండూల్కర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.