Cable Operator Murder Attempt: బామ్మపై కేబుల్‌ ఆపరేటర్‌ హత్యాయత్నం.. శ్వాస ఇచ్చి తల్లికి పునర్జన్మనిచ్చిన కుమార్తె

TV Cable Operator: ఇంట్లో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారా జాగ్రత్త! తెలిసిన వాళ్లే దారుణానికి ఒడిగడతారు. పాలవాడో.. పేపర్‌వాడో.. టీవీ ఆపరేటరో ఎవరో వచ్చి దారుణానికి పాల్పడే అవకాశాలు లేకపోలేదు. ఇలాగే టీవీ రిపేర్‌ కోసం వచ్చి కేబుల్‌ ఆపరేటర్‌ ఓ ముసలావిడపై హత్యాయత్యానికి పాల్పడ్డాడు. చనిపోయిందని భ్రమించి బంగారు సొమ్ములు ఎత్తుకెళ్లాడు. తీరా ఆ ఇంట్లోని సీసీ కెమెరాల ద్వారా అతడి దారుణం వెలుగులోకి వచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 30, 2024, 03:42 PM IST
Cable Operator Murder Attempt: బామ్మపై కేబుల్‌ ఆపరేటర్‌ హత్యాయత్నం.. శ్వాస ఇచ్చి తల్లికి పునర్జన్మనిచ్చిన కుమార్తె

Anakapalle Crime News: టీవీ మరమ్మతు పని కోసం వచ్చిన కేబుల్‌ ఆపరేటర్‌కు దురాశ పుట్టింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పెద్దావిడను హతమారిస్తే మొత్తం చొత్తు చోరీ చేయొచ్చని భావించి ఇంట్లోకి దూరాడు. తువ్వాలు తీసుకుని వృద్ధురాలిని ఊపిరాడకుండా చేయాలని ప్రయత్నించాడు. చనిపోయిందని భావించి ఆమె మెడలోని 8 తులాల బంగారు గొలుసులు ఎత్తుకుని వెళ్లాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డవంతో ఆ దొంగ చిక్కాడు. ఈ సంఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.

అనకాపల్లిలోని గవరపాలెం పార్క్‌ సెంటర్‌ వద్ద నారాయణమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. కొడుకులు, కుమార్తెలకు వివాహాలు కావడంతో వారు వేరే చోట కాపురం ఉంటున్నారు. ఇంట్లో నారాయణమ్మ ఒంటరిగా నివసిస్తుండగా.. అప్పుడప్పుడు పిల్లలు వచ్చి చూసి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న టీవీ బాగు చేసేందుకు కేబుల్‌ ఆపరేటర్‌ మల్ల గోవింద్‌ను నారాయణమ్మ పిలిపించారు. 

టీవీ బాగు చేసేందుకు జనవరి 26వ తేదీన సాయంత్రం 7.30 గంటల సమయంలో గోవింద్‌ ఇంటికి వచ్చాడు. అతడు పని చేస్తున్నాడని భావించిన నారాయణమ్మ వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని గ్రహించిన గోవింద్‌ దొంగతనం చేయాలని భావించాడు. నారాయణమ్మను చంపేయాలని అనుకుని వెంటనే గోవింద్‌ తువ్వాలు తీసుకుని ముసలావిడ మెడకు గట్టిగా బిగించాడు. సోఫా వెనుకాల నిల్చుని తువ్వాలుతో ఆమెను ఊపిరాడకుండా చేశాడు. చంపేందుకు ప్రయత్నిస్తున్న గోవింద్‌ను నారాయణమ్మ బతిమిలాడింది. 'కన్నా నీకేం కావాలన్నా తీసుకెళ్లు రా.. నన్ను వదిలేయ్‌ రా. బంగారం, డబ్బులన్నీ ఇచ్చేస్తా' అని ఆమె ప్రాధేయపడింది. అతడు ఇది పట్టించుకోకుండా పెద్దావిడ నోరు కూడా గట్టిగా మూశాడు. దాదాపు ఐదు నిమిషాల పాటు పెనుగులాటతో నారాయణమ్మ స్పృహ తప్పింది. చనిపోయిందని భావించిన గోవింద్‌ వెంటనే ఆమె మెడలోని బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడు.

పునర్జన్మ ప్రసాదించిన కుమార్తె
కొద్దిసేపటికి కూతురు, అల్లుడు వచ్చి చూడగా నారాయణమ్మ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి కంగారుపడ్డారు. వెంటనే సపర్యలు చేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లికి నోటిలో నోరు పెట్టి ప్రాణం పోసింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించరు. అయితే ఆరోగ్యంగా ఉన్న తల్లి అపస్మారక స్థితికి వెళ్లడంపై ఆమె కుమారుడు కిశోర్‌ అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా కేబుల్‌ ఆపరేటర్‌ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తెలిసిన వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని కిశోర్‌ తెలిపాడు. గోవింద్‌ గతంలోనే డబ్బులు అడిగితే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని కిశోర్‌ తెలిపారు. తల్లిదండ్రులను ఇంట్లో ఒంటరిగా ఎవరూ వదిలేయొద్దని ఈ సందర్భంగా కిశోర్‌ సూచించాడు.

Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News