ఏపీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇన్కాయిస్ హెచ్చరికలతో ఏపీ తీర ప్రాంతాలన్నింటినీ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం చేశాయి. ఆఫ్రికాలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, రాకాసి అలలు విరుచుకుపడే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో రెవిన్యూ, రెస్క్యూ టీం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈదురు గాలులు, భారీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులను సురక్షిత ప్రాంతలకు తరలించాలని సూచించారు.
మరోవైపు విశాఖ తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. అలలు విరుచుకుపడుతుండటంతో పాటు తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఉపరితల ఆవర్తనం కారణంగానే వాతావరణంలో మార్పులు వచ్చాయిని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన గాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, సముద్ర స్నానాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇదిలాఉండగా.. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కాగా మంగళవారం ఈదురుగాలులు.. అకాల వర్షం.. పిడుగులు పడిన ఘటనల్లో 10 మంది మృతిచెందారు.