ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి వ్యవహారదక్షుడని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదేనని ఆయన అన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రానికి కేసీఆర్ చేస్తున్నదేమీ లేదని సర్వే సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ అని ఎప్పుడూ చెప్పుకొనే కేసీఆర్.. ఆ దిశగా పనులు చేయడం మాని తన ఫ్యామిలీనే బంగారు కుటుంబంగా చేసుకొనే యోచనలో పడ్డారని ఎద్దేవా చేశారు.
ఎప్పుడూ తన వారికి మాత్రమే పదవులిస్తూ.. ప్రజలను, పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టిన కేసీఆర్ రేపొద్దున్న తన అల్లుడికి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సత్యనారాయణ తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టేది కేవలం కమీషను కోసం అనే భావన తనకు కలుగుతుందని చెప్పారు.
అదేవిధంగా, తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తుపై కూడా సర్వే సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత తగాదాలు ఏవీ లేవని.. టీఆర్ఎస్ను గద్దె దింపడం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ లాంటి నేతలు గతంలోనూ కాంగ్రెస్కు చేసిందేమీ లేదని సర్వే సత్యనారాయణ తెలిపారు. ఇక కేంద్రం విషయానికి వస్తే మోదీ సర్కారుపై రోజు రోజుకీ ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు ఆర్థిక భారం తప్ప ఇతరత్రా మంచేమీ జరగలేదని తెలిపారు.