అమరావతి: AP CM YS Jagan ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ టెక్నికల్ (కమెర్షియల్) ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ ( APTCIA) ప్రతినిధులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రిని నేరుగా కలిసేందుకు వీలు లేకపోవడంతో కరోనా సంక్షోభంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల ( Financial crisis) గురించి లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలియజేసిన అసోసియేషన్ ప్రతినిధులు.. రాష్ట్రంలోని అన్నివర్గాల వారు, అన్ని తరగతుల వారికి మేలు కలిగేలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ( CM YS Jagan's one year govt : సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఎగుడు దిగుడులు )
ముఖ్యమంత్రి సహాయం కోరుతూ లేఖ రాసిన విషయంపై అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. కరోనావైరస్ నివారణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా తమ ఇనిస్టిట్యూట్స్ మూతపడ్డాయని.. ఫలితంగా ఇనిస్టిట్యూట్స్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను వివరిస్తూ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాసినట్టు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంతోమందికి ఉపాధి బాట చూపించేందుకు శిక్షణ ఇచ్చి వారి ఉన్నతికి దోహదపడిన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, ఇతర వృత్తి విద్యల ఇనిస్టిట్యూట్స్ నిర్వాహకులు ఇటీవల కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కంప్యూటర్ వినియోగం విరివిగా పెరిగిన నేపథ్యంలో టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ వృత్తి విద్యలకు ఆదరణ తగ్గుతుండటంతో ఏళ్ల తరబడిగా ఆ వృత్తి విద్యనే నమ్ముకున్న తాము ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లకు గురవుతున్నామన్నారు. దీనికితోడు మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఇప్పటికే ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న తమపై లాక్ డౌన్ ( Lockdown) మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిందని.. ఈ ఆర్థిక భారం కారణంగా చివరకు ఇనిస్టిట్యూట్స్కి కిరాయి కూడా చెల్లించుకోలేని దుస్థితి ఏర్పడటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ( ఏపీలో తాజాగా 82 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట )
ఈ తరహా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న ఇనిస్టిట్యూట్స్ని నిర్వహిస్తున్న వారు, సిబ్బంది అంతా 55 ఏళ్లపైబడిన వారే కావడంతో.. వారి ఆరోగ్యంపైనా ఈ ఇబ్బందులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పిన ఆయన.. అన్నివర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నట్టుగానే ప్రభుత్వం తమకు కూడా అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..