BC Bandhu Scheme Cheques : బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 230 మంది లబ్దిదారులకు 2 కోట్ల 30 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ... కులవృత్తులకు జీవం పోయడంతో పాటుగా ప్రతి కార్మికుడు కార్మికుడిగా మిగిలి పోకుండా యజమాని కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.
బీసీ బంధు పథకం కోసం తాము కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని.. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఇంకొంతమంది నిరసన వ్యక్తంచేయడంపై ఎమ్మెల్యే బానోతు శంకర్ స్పందిస్తూ.. బీసీ బంధు పథకం ద్వారా బీసీలకు ఆర్ధిక సహాయం అందించడం అనేది ఇకపై నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. దరఖాస్తుదారులు తమకు రాలేదని ఎవ్వరు నిరాశా నిస్పృహలకు లోనుకాకూడదన్నారు.
ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని బానోత్ శంకర్ నాయక్ విస్మయం వ్యక్తంచేశారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పోరిక బాలరాం నాయక్ గురించి స్పందిస్తూ.. బలరాం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ను 5500 రూపాయలకు అందిస్తామని అంటున్నారని మండిపడ్డారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలీనం చేస్తామని కారుకుతలు కూసిన ఘనత బలరాం నాయక్ సొంతమని మండిపడ్డారు. బలరాం నాయక్ లాంటి నాయకుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిదని ఎద్దెవా చేశారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ కు ఓటు వేసి ఆశీర్వదించాలని బానోత్ శంకర్ నాయక్ కోరారు.