హైదరాబాద్‌ని దేశానికి రెండో రాజధానిని చేస్తే ఎలా వుంటుందనే ప్రతిపాదన చుట్టూ గత కొన్ని రోజులుగా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఎవరికి వుండే అభిప్రాయాలు వారికి వున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రతిపాదనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. హైదరాబాద్ దేశ రెండో రాజధాని ప్రతిపాదన స్వాగతించదగిన పరిణామమే అని చెప్పడం సైతం చర్చనియాంశమైన నేపథ్యంలో దీనిపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఏం చెబుతారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది మీడియా.
అయితే, ఈ ప్రతిపాదనపై కోదండరామ్ స్పందిస్తూ.. "రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ వుండటం అనేది తెలంగాణ రాష్ట్ర సాధనకు కలిసొచ్చే అంశమైంది కానీ ఇదే హైదరాబాద్‌ని దేశానికి రెండో రాజధానిని చేస్తే, దానివల్ల తెలంగాణకన్నా ఆంధ్రావాళ్లకే ఎక్కువ మేలు జరుగుతుంది" అని అభిప్రాయపడినట్టుగా ది హన్స్ ఇండియా డైలీ ఓ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ద్రోహులకి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అసలు తెలంగాణ కోసం పోరాడిన వారిని నిర్లక్ష్యం చేస్తోందని, రైతన్నలకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని కోదండరామ్ ఆవేదన వ్యక్తంచేసినట్టుగానూ ఆ కథనం స్పష్టంచేసింది.