Ind vs Pak Highlights: కసి తీర్చుకున్న భారత్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి పాక్‌ ఔట్‌?

Pakistan Out From Champions Trophy 2025 Unofficially: ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ ఘోర పరాభవం ఎదురైంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమి చెందిన పాకిస్థాన్‌ అనధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. భారీ విజయంతో టీమిండియా ముందడుగు వేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 23, 2025, 10:18 PM IST
Ind vs Pak Highlights: కసి తీర్చుకున్న భారత్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి పాక్‌ ఔట్‌?

India vs Pakistan Match Highlights: గత ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో తమను ఓడించిన పాకిస్థాన్‌పై భారత్‌ కసి తీర్చుకుంది. ట్రోఫీని ఎగరేసుకుపోయిన పాకిస్థాన్ జట్టును ఈసారి టోర్నీ నాకౌట్‌ స్టేజ్‌లోనే అనధికారికంగా భారత జట్టు ఇంటికి పంపించేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో పరాభవానికి భారత బౌలర్లు, బ్యాటర్లు ప్రతీకారం తీర్చుకున్నారు. బౌలింగ్‌లో నిప్పులు చెరిగేలా బంతులు వేస్తూ స్కోర్‌ బోర్డుకు అడ్డుకట్ట వేయగా.. బ్యాటింగ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా చేస్తూ సునాయాసంగా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. విరాట్‌ కోహ్లీ మరోసారి సెంచరీ చేసి భారత్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 45 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

Also Read: Imam ul Haq Run Out: 'ఓహో నో.. ఇది ఔటా?' పాకిస్థాన్‌ అమ్మాయిల వీడియో వైరల్‌

కోహ్లీ పూనకం
రోహిత్‌ శర్మ ఔటయిన దశలో వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా చివరి వరకు క్రీజులో నిలబడి సెంచరీ నమోదు చేశాడు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌ అంటే కోహ్లీకి పూనకాలు వస్తాయి. అలాంటిదే ఆదివారం కూడా కనిపించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్ సెమీస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాక్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 49.4 ఓవర్‌ 241 స్కోర్‌ చేసి ఆలౌటైంది. భారత్‌ 42.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది.

Also Read: Nara Lokesh Pic Viral: క్రికెట్‌ మ్యాచ్‌లో నారా లోకేశ్.. ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం

పాకిస్థాన్‌ విధించిన మోస్తరు లక్ష్యం 242 లక్ష్యాన్ని చాలా తేలికగా భారత జట్టు సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (20) తక్కువ పరుగులకే పరిమితమవగా.. గత మ్యాచ్‌ సెంచరీ యువరాజు శుభమన్‌ గిల్‌ కొద్దిలో అర్ధ శతకాన్ని చేజార్చుకున్నాడు. 52 బంతుల్లో 46 పరుగులు చేయగా.. రోహిత్‌ ఔట్‌తో స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ రంగంలోకి దిగాడు. మొదట్లో ఆచితూచి ఆడిన కోహ్లీ క్రమంగా పుంజుకుంటూ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఒక్క సిక్సర్‌ లేకుండా శతకం నమోదు చేయడం విశేషం. మొత్తం 7 ఫోర్లు బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడైన బ్యాటింగ్‌తో (67 బంతుల్లో 56 పరుగులు) అర్థ సెంచరీ పూర్తి చేసి నిష్క్రమించాడు. హార్దిక్‌ పాండ్యా రాగానే దూకుడైన బ్యాటింగ్‌తో 8 పరుగులు చేసి వెళ్లిపోయాడు. క్రీజులో ఉన్న అక్షర్‌ పటేల్‌ (3)తో కలిసి కోహ్లీ విజయంతో మ్యాచ్‌ను ముగించాడు.

పాక్‌ ఘోరంగా వైఫల్యం
మోస్తరు లక్ష్యాన్ని పాకిస్థాన్‌ బౌలర్లు కాపాడలేకపోవడంతో జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అనధికారికంగా వైదొలిగింది. ఆరంభం నుంచి బౌలర్లు భారత్‌ను నిలువరించలేకపోయారు. పటిష్టంగా బౌలింగ్‌ చేస్తూనే ఉన్నా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ, శ్రేయస్‌, ఒక దశలో గిల్‌ను నియంత్రించలేకపోయారు. దీనికితోడు క్యాచ్‌లు మిస్‌ జట్టు ఓటమిలో ప్రధాన కారణంగా నిలుస్తోంది. షాహిన్‌ అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌, కుష్దీల్‌ షా చెరొక వికెట్‌ తీశారు. మిగతా బౌలర్లు భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పక తప్పదు.

గౌరవప్రదమైన స్కోర్‌
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బాబర్ ఆజం (23), ఇమామ్ (10) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరగా.. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ (76 బంతుల్లో 62 పరుగులు), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. షకీల్‌, ఇమామ్‌ కలిసి 3వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాక్ మోస్తరు స్కోర్‌ సాధించింది. తయ్యబ్ తహీర్ (4) తక్కువ స్కోర్‌కు ఔటవగా.. అనంతరం కుష్దిల్ షా (39 బంతుల్లో ౩8, 2 సిక్సర్లు) రాణించడంతో పాక్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

భళా భారత బౌలింగ్‌ దళం
కీలకమైన మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థిపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఐదు వికెట్లు తీసిన సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌కే పరిమితమవగా.. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి పాకిస్థాన్‌ నడ్డి విరిచాడు. హార్దిక్ పాండ్యా కీలకమైన రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేసి స్కోర్‌ బోర్డును నియంత్రించారు. ఎక్కడా కూడా భారీ పరుగులు చేసేందుకు పాక్‌ బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు.

హ్యాట్రిక్‌పై భారత్‌ ఆశలు.. పరువు కోసం పాకిస్థాన్‌
ఛాంపియన్స్‌ ట్రోఫీ మార్చి 2వ తేదీన జరగనున్న చివరి నాకౌట్‌ మ్యాచ్‌లో భారత జట్టు తలపడనుంది. ఇప్పటికే అనధికారికంగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ముందడుగు వేసిన భారత జట్టు హ్యాట్రిక్‌ విజయంతో ట్రోఫీని ఎగరేసుకుపోవాలని భారత జట్టు ఆశిస్తోంది. ఇక వరుసగా రెండు ఓటములు చెందిన పాకిస్థాన్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఈనెల 27వ తేదీన బంగ్లాదేశ్‌తో ఆడనుంది. భారత్‌ చేతిలో ఓడిపోయిన రెండు జట్లు తలపడుతుండడం ఆసక్తికరం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News