Gongadi Trisha Gets One Crore Cash Prize From Telangana: అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన గొంగడి త్రిషకు భారీ నగదు బహుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అనంతరం త్రిషను ఘనంగా సన్మానించింది.
తెలంగాణకు చెందిన గొంగడి త్రిష అండర్ -19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ అనంతరం తెలంగాణకు చేరుకున్న గొంగడి త్రిషకు ఘన స్వాగతం లభించింది.
మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆమె సేవలను కీర్తిస్తూ నగదు బహుమతిని ప్రకటించింది.
గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. అనంతరం రూ.కోటి నగదు బహుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.
మరో క్రీడాకారణి ధృతి కేసరికి రూ.10 లక్షలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్‌కు రూ.10 లక్షలు, శిక్షకురాలు శాలినికి రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష భారత క్రికెట్‌కు ఆశాకిరణంలా మారింది. అండర్ 19 ప్రపంచకప్‌లో సెంచరీ నమోదు చేసి త్రిష అన్ని రికార్డులను తిరగరాసింది. ఆమె ప్రదర్శనకు దిగ్గజ ఆటగాళ్లు కూడా అభినందిస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
ప్రపంచకప్‌లో విశేష ప్రతిభ కనబర్చిన త్రిష భవిష్యత్‌లో భారత మహిళల ప్రధాన జట్టులో కనిపించే అవకాశం ఉంది. క్రికెటర్‌గా రాణించడంలో త్రిష తండ్రి తీవ్రంగా కృషి చేశారు. ఈ సందర్భంగా తండ్రికి తన తొలి సెంచరీని త్రిష అంకితం చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్లీ త్రిష బ్యాట్ పట్టనుంది.