Maha Kumbh Mela 2025: మహాకుంభమేళకు అయోధ్య నగరం ముస్తాబు అవుతోంది. వచ్చే ఏడాది రామాలయం ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి మహాకుంభమేళా జరుగుతుండటంతో అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం, బాలరాముడు కొలువుదీరి ఏడాది పూర్తి కావస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Maha Kumbh Mela 2025: కొత్త ఏడాది, మహా కుంభమేళా పురస్కరించుకుని అయోధ్య నగరం అందంగా ముస్తాబు అవుతోంది. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 44 రోజులు పాటు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది
ఈ కుంభామేళాకు కోట్లాది మంది ప్రజలు తరలిరానున్నారు. కుంభమేళాకు వచ్చే ప్రజలు అయోధ్య బాలరాముడి దర్శనానికి వస్తారు. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి కుంభమేళా జరుగుతుండటంతో అయోధ్యలోనూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయోధ్య నగర వీధులన్నీ రామునిచిత్రాలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. రామచరిత మానస్ గోడలపై రూపొందించారు. గుప్తర్ ఘాట్ నుంచి కొత్త ఘాట్ వరకు రామాయణ ఇతివ్రుత్తాలను గోడలపై చిత్రాల రూపంలో రూపొందిస్తున్నారు.
రాత్రివేళలో కూడా కనిపించేలా వాటికి విద్యుత్ దీపాలను అమర్చుతున్నారు. అయోధ్యకు తరలివచ్చే భక్తుల కోసం మంచినీటి సదుపాయాన్నికూడా ఏర్పాటు చేశారు
అయోధ్యలోని సూరజ్ కుండ్ లో లేజర్ షోను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుంభామేళా జరుగుతున్న అన్ని రోజులు లేజర్ షో జరుగుతుందన్నారు.
రామాయణ చరిత్రను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వీడియోల రూపంలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. కుంభమేళా కోసం వచ్చే విదేశీయుల కోసం ఆంగ్ల భాషలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
కొత్త ఏడాది వేళ అయోధ్య నగరం పర్యాటకులతో కిటకిటలాడనుంది. కొత్త సంవత్సరం వేళ పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే హోటల్ గదులన్నీ బుక్ అయినట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందని జనవరి 15వ తేదీ వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయినట్లు స్థానిక హోటల్ యజమానులు చెబుతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇక అయోధ్యలో పువ్వులకు కూడా గిరాకీ పెరుగుతోంది. జనవరి 3వ తేదీ వరకు పూలకు గిరాకీ ఉండే ఛాన్స్ ఉందని పూలు అమ్మేవాళ్లు చెబుతున్నారు. కొత్త సంవత్సరం దేశ నలుమూలల నుంచి రాముడి దర్శనానికి భక్తులు రానున్న నేపథ్యంలో పువ్వులకు డిమాండ్ పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా బంతిపువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులకు మంచి గిరాకీ ఉందని చెబుతున్నారు.