TS Liquor Rates: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్ చెప్పనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైయింది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
TS Liquor Rates: అవును తెలంగాణలో కొలువు దీరిన తెలంగాణ సర్కార్ ఇపుడు మద్యం ప్రియులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై కీలక కసరత్తులు చేస్తోంది. ఏ విధంగా మద్యం ధరలు పెంచాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. మద్యం ధరల పెంపుపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో చివరిసారిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం ధరలు భారీగా పెంచారు. గడిచిన 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.
మద్యం ధరలను పెంచడంతో పాటు.. మద్యం విక్రయాలపై తమకు ఇచ్చే మార్జిన్‌ను కూడా పెంచాలని ఆ సంస్థ సర్కారుకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. అయితే మద్యం ధరలు పెంచాలని.. మద్యం కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని 6 నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలిసారి జూలై 18వ తేదీన సమావేశమైంది.
జులై 25వ తేదీ లోగా కంపెనీలు మద్యం సరఫరా కోసం ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఆ తర్వాతి రోజే సీల్డ్ కవర్లు తెరిచి కంపెనీలు కోట్ చేసిన ధరలను కమిటీ చూసింది. మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని.. బీరు, బ్రాండీ, విస్కీ, రమ్, వైన్, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే మద్యం మార్కెట్‌లో దాదాపు 60 శాతం వాటా ఉన్న యూబీ బీర్ల కంపెనీ.. తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 33 శాతం అదనంగా చెల్లించాలని కోట్ చేసింది. ఇక డిమాండ్‌ను ఇతర కంపెనీలు చేస్తున్నాయి.
అయితే 2023లోనే బేసిక్ ధర పెంచాలని మద్యం కంపెనీలు కోరగా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పటికే మద్యం ధరల పెంపునకు సంబంధించి రూ.10 నుంచి రూ.20 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బీర్ల ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటి ధరలు పెంచాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
ఇక రాష్ట్రంలో ప్రముఖ కంపెనీల బీర్ల కొరత ఉన్నట్లు మద్యం షాపు యజమానులు చెబుతున్నారు. అయితే కింగ్ ఫిషర్ బీర్ల కొరతను అధిగమించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
ఇందుకోసం మిగతా 5 బీర్ల కంపెనీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే కింగ్‌ఫిషర్, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ఫిషర్ అల్ట్రా, కింగ్‌ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌లు మినహా.. మిగతా బీర్లను మద్యం డిపోల్లో అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బ్రేవరేజెస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.