ఆఫీసుకు మొదటి రోజు వెళ్లిన ఉద్యోగి... స్కూల్‌కు మొదటి రోజు వెళ్లిన విద్యార్ధి ఇద్దరూ ఒక్కరే. కానీ ఆఫీసు, స్కూల్ ఇదొక్కటే తేడా. ఇద్దరికీ కొత్త కాబట్టి బెరుకు అనేది సహజం. ఇవేవీ లేకుండా ఆఫీసులో నలుగురిలో కలిసిపోవాలంటే ఇలా చేయండి.
* ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఉద్యోగులతో పరిచయం చేసుకోండి.. వారి గురించి తెలుసుకోండి. ఆఫీసు పనుల్లో ఏదైనా సందేహం వస్తే.. అడిగి తెలుసుకోండి. దీనివల్ల సత్సంబంధాలు బలపడతాయి.
* ఆఫీస్ టైమింగ్స్, వాతావరణం, పనులు లాంటివి ఒక్కొక్కటి అడిగి తెలుసుకోండి. లంచ్ టైమింగ్స్‌లో సహోద్యోగులతో కలిసి భోజనం చేయండి. తిన్న తరువాత ఆఫీసు పరిసరాల్లో వారితో కలిసి తిరగండి.
* మీరు చేయగలిగే పనులు తీసుకోండి.. సకాలంలో పూర్తి చేయండి. అంతేగానీ చేయలేని పనులను తీసుకొని ఏదో మిమ్మల్ని మీరు నిరుపించుకోవాలని బాధ్యతలను ఒక్కరే తీసుకొని సమస్యలను ఏరికోరి తెచ్చుకోవద్దు. ఒత్తిడి పెంచుకోవద్దు.
* మీరు వచ్చిన మొదటి రోజే "ఫలానా వ్యక్తి అలా ఇలా" అని కొంత మంది ఉద్యోగులు చెప్పే ప్రయత్నం చేస్తారు. నాకు అలాంటి వాటి మీద ఆసక్తి లేదు.. ప్లీజ్.. అని సున్నితంగా తెలియజేయండి.
* తోటి ఉద్యోగులు బాగా పని ఒత్తిడితో ఉన్నారనుకోండి.. వెంటనే వారికి సహాయం చేయండి. మీరూ బృంద పనితీరుకు ప్రాధాన్యత ఇస్తారని అర్థమవుతుంది.