హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైలు ఫిబ్రవరి 7న పరుగులు పెట్టనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ట్వీట్ చేసింది. 2020లో హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ల మధ్య 7న సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని అప్ డేట్స్ తెలుపుతామని తమ ట్వీట్లో సంస్థ పేర్కొంది. తాజా కారిడార్ అందుబాటులోకి వస్తే నగరంలో తొలి దశలో మొత్తంగా మెట్రో సర్వీసులు 69 కి.మీ మేర విస్తరించనున్నాయి.
What about the Dar Ul Shifa to FALAKNUMA Metro line you have funds to lay & start JBS Metro station but when it comes to South of Hyderabad you have no answer https://t.co/8XF9ZRKRYV
— Asaduddin Owaisi (@asadowaisi) February 6, 2020
జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైలు రాకపోకలపై ఈ మార్గాల్లో నిత్యం ప్రయాణించేవారు త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, సమయం కలిసొస్తుందని సంతోషిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ చేసిన ట్వీట్‌పై స్పందించారు. దారుల్ షిఫా - ఫలక్‌నుమా మెట్రో మార్గానికి కూడా నిధులు కేటాయించి జేబీఎస్ మెట్రో ప్రారంభించాలన్నారు. కానీ దక్షిణ హైదరాబాద్ విషయానికొచ్చేసరికి మీ వద్ద ఏ సమాధానం ఉండదంటూ చరుకలంటించారు అసదుద్దీన్. జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో మార్గానికి మీతో నిధులు చాలినన్ని ఉన్నాయని, అయితే ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గాన్ని ఎప్పుడు ప్రారంభించి, ఎప్పటికీ పని పూర్తి చేస్తారో చెప్పాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ ట్వీట్‌పై స్పందిస్తూనే అసదుద్దీన్ ప్రశ్నించారు.
Amazing that you have funds for JBS & MGBS,when will @hmrgov start and complete MGBS to FALAKNUMA ? https://t.co/FnCyy8Y829
— Asaduddin Owaisi (@asadowaisi) February 6, 2020
కాగా, జేబీఎస్, ఎంజీబీఎస్ లను అనుసంధానం చేస్తూ మెట్రో కారిడార్ 2 నిర్మించారు. తొలుత జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కి.మీ మేర మెట్రో ప్రతిపాదించినా.. కొన్ని కారణాల వల్ల పాతబస్తీని మినహాయింపు ఇవ్వడం తెలిసిందే. రేపటి నుంచి జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ 9 మెట్రో రైలు స్టేషన్లు నగరంలో అందుబాటులోకి రానున్నాయి.