నిర్భయ దోషులను ఉరితీయాల్సిందే: తలారి పవన్ జల్లాద్

Nirbhaya convicts: ఏడేళ్ల కిందట దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులను కచ్చితంగా ఉరితీయాల్సిందేనని, అప్పుడే నిర్భయ తల్లిదండ్రులకు ప్రశాంతత దొరుకుతుందని తలారి పవన్ జల్లాద్ అన్నాడు.

Last Updated : Jan 31, 2020, 01:20 PM IST
నిర్భయ దోషులను ఉరితీయాల్సిందే: తలారి పవన్ జల్లాద్

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు అమలవుతుందా అని యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు తిహార్ జైలు అధికారులు నిర్భయ కేసులో దోషులైన ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మల మరణశిక్ష అమలు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తలారి పవన్ జల్లాద్ గురువారం రాత్రి తిహార్ జైలుకు చేరుకున్నాడు. శనివారం రోజు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేయనున్న తరుణంలో ఒకరోజు ముందు శుక్రవారం రోజు ఉరిశిక్షపై ట్రయల్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ అయింది.

Also Read: నిర్భయ భయానక ఘటన రోజు ఏం జరిగింది?

ఆ నలుగురు దోషులను ఉరితీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తలారి పవన్ జల్లాద్ మరోసారి స్పష్టం చేశాడు. వీరిని ఉరి తీయడం నిర్భయ తల్లిదండ్రులతో పాటు తనకు, దేశ ప్రజలకు ఎంతో  ఉపశమనం కలిగిస్తుందన్నాడు. ఇలాంటి కామాంధులను కచ్చితంగా ఉరితీసి తీరాల్సిందేనని ఆకాంక్షించాడు.  నిర్భయ దోషులను ఉరితీసేందుకు యూపీలోని మీరట్‌కు చెందిన తలారి పవన్ జల్లాద్‌ను మూడు వారాల కిందట ఎంపిక చేశారు. అయితే తొలుత నిర్ణయించినట్లుగా జనవరి 22న విధించాల్సిన ఉరిశిక్ష ఫిబ్రవరి 1కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

Also Read: ఉరిశిక్ష వేసే ముందు నిజంగానే చివరి కోరిక అడుగుతారా?

కాగా, ఉరిశిక్ష అమలుపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ పాటియాలా కోర్టు విచారిస్తోంది. తమకు న్యాయపరమైన అవకాశాలు పూర్తయ్యే వరకు ఉరి అమలును వాయిదా వేయాలని నలుగురు దోషులు పాటియాలా కోర్టుకు విన్నయించుకున్నారు. దోషుల పిటిషన్‌పై తిహార్ జైలు అధికారులను కోర్టు వివరణ కోరింది. ఉరిశిక్ష అమలులో జాప్యం చేసేందుకే దోషులు ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలుచేసి కాలయాపన చేస్తున్నారని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు, జైలు అధికారులు ఆరోపిస్తున్నారు.

నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలారు. అయితే వీరిలో ఒకరు మైనర్. కాగా అతడు మూడేళ్లపాటు జువైనల్ హోంలో ఉండి అనంతరం విడుదలయ్యాడు. మరో దోషి రామ్ సింగ్ కేసు విచారణలో ఉన్న సమయంలోనే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాను కూడా ఆ సమయంలో మైనర్ అని రేపు ఉరిశిక్ష అమలుకానున్న మరో దోషి పవన్ గుప్తా మరోసారి కోర్టును ఆశ్రయించాడు. గతంలోనే ఇలాంటి పటిషన్‌ను కోర్టు కొట్టివేయడం గమనార్హం.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News