Telangana Politics: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వ్యవహార తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. స్వపక్షంలో విపక్షంలా మారిపోయారనే వాదన బలపడుతోంది. ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. వీఐపీ బ్రేక్ దర్శనం దొరకకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపైనే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ ఎపిసోడ్ ముగియకముందే మరోసారి సంచలనంగా మారారు.. జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి సెజ్‌లో పర్యటించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అక్కడి పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఫార్మా కంపెనీలను తగలబెడతానంటూ హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: MLA Padi Kaushik Reddy: రాజ్ పాకాల ఇంట్లో అదే జరిగింది.. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్: పాడి కౌశిక్ రెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనిరుధ్ రెడ్డి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. అయితే అనిరుధ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగినా.. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి సహకారంతో ఆయన టికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సదరు మంత్రికి ఆయన ముఖ్య అనుచరుడిగా మారిపోయారు. అయితే ఎమ్మెల్యేగా గెలవగానే అనిరుధ్ రెడ్డి తనదైన స్టైల్లో పాలన చేస్తున్నారు. జడ్చర్లలో బీఆర్ఎస్ నేతలకు తన దగ్గరకు కూడా రానీయడం లేదు ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీలో చేరేందుకు చాలా మంది లీడర్లు ఆయన్ను సంప్రదించారు. కానీ.. పదేళ్లు కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేసేందుకు ఏ ఒక్క నేతను పార్టీలో చేర్చుకోలేదు. ఇటీవల జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తమకు అవసరం లేదని. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసాకే.. జడ్చర్ల మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లారు. తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న తమకు వీఐపీ దర్శనం దొరకకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లెటర్లను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకుల పై ఎందుకు అంత చిన్నచూపు అని ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవట్లేదా అని వ్యాఖ్యానించారు. ఏపీ నేతలని తెలంగాణకు రావద్దంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిచారు. తిరుమలలో తెలంగాణ నాయకులకి ప్రాధాన్యత ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. తిరుమల తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. సీఎం చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది..
ఇక ఈ మాటల మంటలు చల్లారక ముందే మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. తాజాగా తన సొంత నియోజకవర్గంలోని పోలేపల్లి సెజ్‌లో ఆయన పర్యటించారు. ఫార్మా కంపెనీల నుంచి వ్యర్ధ జలాలను రైతుల పంటపొలాలలోకి విడుదల చేస్తే ఫార్మా కంపెనీని తగలబెడతానని తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా తాను పరిశ్రమల కాలుష్యంపై మాట్లాడినా కూడా అధికారులు స్పందించక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయమై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. తాను రైతుల పక్షాన ఉంటూ రైతుల కోసం పోరాడుతానని మరో మారు ఫార్మా కంపెనీలు కాలుష్య జలాలను విడుదల చేస్తే పరిశ్రమలను తానే వచ్చి తగలబెడతానని చెప్పడం సంచలనంగా మారింది.
అయితే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీరుపై అధికార పార్టీలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోందట.. ఇటీవల జడ్చర్ల నియోజకవర్గంలో చేప పిల్లల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. చేప పిల్లలు ఇంత తక్కువ సంఖ్యలో వదిలిపెట్టడంపై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ఉంటూ లేఖ రాయడంపై సరికొత్త చర్చ జరుగుతోందట. అయితే ఎమ్మెల్యే ఇలా దూకుడుగా వ్యవహరించడం వెనుక ఇంకా ఏదైనా కారణముందా అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ మీడియాలో సంచలనం కోసం ఇలా మాట్లాడుతున్నారా.. లేదంటే.. ఆయన మాటల వెనుక ఏదైనా వ్యూహముందా.. అనే చర్చ సైతం జరుగుతోంది. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ధైర్యం వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారని చర్చ సైతం లేకపోలేదు.. తన కామెంట్స్ తర్వాత ఏదైనా జరిగితే.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డే చూసుకుంటారని ఆయన ఆలోచనగా ఉందట. అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే నేరుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చెబుతున్నారు..
మొత్తంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీరుపై క్యాడర్ ఫుల్ ఖుషీ అవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి తిరుమల కొండపైకి ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యే లేవనెత్తితే కానీ సమస్య అందరికీ అర్థం కాలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ నేతలను అధికార పార్టీ కనుసన్నల్లోకి కూడా రానీయకపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: KTR Celebrations: దీపావళి వేళ సంబరాలకు కేటీఆర్ పిలుపు.. ఎందుకు? ఏం సాధించారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook