One Police One State in Telangana: ఏక్ పోలీస్-ఏక్ స్టేట్ అమలు గురించి TGSP కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, టీఎస్ఎస్పీ ఏడీజీపీకి ఆవేదనతో లేఖ రాశారు. ఏక్ పోలీస్-ఏక్ స్టేట్ అమలు కోసం శాంతియుత మార్గంలో తాము ధర్నాలు చేస్తున్నామన్నారు. తాము ఒక చోట, తమ భర్తలు హైదరాబాద్‌లో డ్యూటీలు చేస్తున్నారని.. ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే హస్పిటల్‌కు వెళ్లేందుకు, మంచి చెడులు చూసేది ఎవరు సార్ అని ప్రశ్నించారు. వెంటనే రమ్మంటే రికార్డు పర్మిషన్ రాలేదని.. సీఎల్ ఇవ్వరని చెబుతున్నారని అన్నారు. సీఎల్ కోసం తమ భర్తలు గట్టిగా అడిగితే.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగానికి అబ్సేంట్ కాలేక.. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నీచ బానిస బతుకులు బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"కొన్ని సార్లు కంపెనీలో స్ట్రెంత్ లేనప్పుడు ఒక్కోసారి నెల రెండు నెలలు అయితే కూడా ఇంటికి వచ్చేవారు కాదు. ఈ విధంగా చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తండ్రిని చూసి మా ఇంట్లో చిన్న పిల్లలు వారిని గుర్తుపట్టాలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇంటికి వచ్చిన తండ్రిని చూసి సంతోషించాల్సిన పిల్లలే వారిని చూసి ఏదో కొత్తవారిని చూసినట్టు భయంతో వారి దగ్గరకు పోకుండా ఏడిస్తే ఆ తండ్రి ఏమని బాధపడాలి. ఆ బాధను మేము ఏ విధంగా దిగమింగాలి. అదే విధంగా హైదరాబాదులో TGSP వాళ్ళకు ఇచ్చినా అకామినేషన్స్లో హుస్సేనీ ఆలం, కవాడిగూడ, రాజేంద్రనగర్, బేగంపేట్ మొదలగు పోస్టింగ్స్ పశువులు పందులు నివసించే దానికన్నా హీనంగా అధ్వానంగా ఉంటాయి. చిన్న చిన్న రూములలో పది పది మందికి పైగా ఉంటూ.. అందులోనే వాష్ రూమ్స్ లెట్రిన్ రూమ్స్ ఆ దుర్వాసనలతో ఎంతో ఇబ్బంది పడుతూ రాత్రిపూట దోమలు బొద్దింకలు నల్లులు బాధ భరించలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు.
దీని మీద మీకు ఎమైనా సందిగ్ధం ఉంటే ఒక్కసారి మీరు ఒక్క హుస్సేనీ ఆలం పోస్టును విజిట్ చేయండి అక్కడి పరిసర ప్రాంతం ఏ విధంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది సార్. TGSP వాళ్ళను స్థిరంగా కొన్ని రోజులు ఒకే దగ్గర ఉంచకుండా సిక్స్ మంత్స్ బెటాలియన్‌లో సిక్స్ మంత్స్ హైదరాబాద్‌లో ఉంటూ అటు ఇటు company's తిప్పితే మా పిల్లలను స్థిరంగా ఎక్కడ చదివించుకోలేకపోతున్నాం. మా పిల్లల్ని కూడా అటు ఇటు స్కూల్స్ ను చేంజ్ చేస్తే రేపటి వాళ్ళ భవిష్యత్తులో స్థానికతను వాళ్ళ సొంత జిల్లాలో కోల్పోతే, మరి రేపటినాడు వారి విద్యార్హత సీట్లలో గానీ ఉద్యోగ అవకాశాలలో గానీ మేము ఏ జిల్లాకు చెందిన స్థానికతను చూపించుకోవాలో ఒకసారి ఆలోచించండి సార్. మా తల్లిదండ్రులు పెళ్లి చేసి సాగనంపినప్పుడు కూడా అంతగా బాధపడి ఏడవలేము సార్ కానీ పర్మిషన్ నుంచి TGSP వాళ్ళు రిటర్న్ వెళుతున్నప్పుడు మళ్లీ ఎప్పుడు వస్తారేమో అనిపిల్లలూ మేము పిచ్చిగా ఏడుస్తూ భయం భయంగా ఉంటాము..
బయట ఎమర్జెన్సీ మూమెంట్స్‌కు వెళ్తే కూడా తోటి సివిల్ ఏఆర్ ఉద్యోగులైనా గౌరవిస్తారా అంటే అది ఉండదు. TGSP అంటే బువ్వ పోలీస్ పార పోలీస్ అంటూ హేళన చేస్తూ డ్యూటీస్‌లో ఘోరంగా చిన్నచూపు చూస్తున్నారు. ఇంత దుర్మార్గ పరిస్థితియో మరొక సారి ఆలోచించండి. అంటే TGSP పోలీస్ కావడమే వాళ్ళు చేసిన నేరమా.. ఒకే నోటిఫికేషన్ ఒకే పరీక్ష ఓకే ఈవెంట్స్‌లో పాల్గొని పోలీస్‌గా ఎంపికైన సివిల్ ఏఆర్ వాళ్ల కుటుంబాల మాదిరిగానే మా కుటుంబాలు కూడా ఈ రోజు ఎందుకు అంత సంతోషంగా లేవు. ఎందుకు ఇంత మనోవేదనకు ఎందుకు గురవుతున్నాయని ఒక్కసారి ఆలోచించండి సార్.
గతంలో మీర్ ఏక్ పోలీస్ గురించి మాట్లాడుతూ.. TGSP వాళ్ళు ఎక్కడ ఏ రాజకీయ పార్టీల సమావేశాలు జరిగిన బందోబస్తు నిర్వహిస్తూ మాకు ( రాజకీయ నాయకులకు) రక్షణగా ఉంటారు కానీ వాళ్ళ సొంత కుటుంబాలకు రక్షణగా ఉండలేకపోతున్నారని అన్నారు. శాంతి భద్రతలు కల్పిస్తూ బందోబస్తు డ్యూటీలు చేస్తారని అభినందించారు. పోలీసులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ ఏక్ పోలీస్ చేస్తానని హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగానే మమ్మల్ని అందరినీ ఏక్ పోలీస్ చేస్తారని, మీ మీద నమ్మకంతో ఈరోజు కొన్ని వేల కుటుంబాలు మా ఇబ్బందులు సమస్యల మీద, బెటాలియన్ లో TGSP వాళ్ళ బానిస బతుకుల మీద బాధతో రోడ్డుమీదికి వచ్చి మీ ప్రకటన (ఏక్ పోలీస్) కోసం శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం.
ఇందులో ఎలాంటి ప్రలోభాలు, ఎవరి (ఏ రాజకీయవేత్తల, రాజకీయ శక్తుల, విద్యావంతుల) ప్రమేయాలు లేవు .. మా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఇది నిజం సార్. కానీ కొన్ని దుష్టశక్తులు (మా పై అధికారులూ) TGSP వాళ్ళ మీద మీకు తప్పుడు సమాచారం ఇస్తూ ఏక్ పోలీస్ విధానాన్ని అడ్డుకోవాలని అడుగడుగునా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఏక్ పోలీస్ చేస్తే వారి ఇంటి (బంగ్లా) దగ్గర బానిస పనులు వెట్టి చాకిరి చేయడానికి వారి ఇంటిలో కార్యక్రమాలకు పర్సనల్ విషయాలకు సొంత పనులను చేసి పెట్టడానికి ఎవరు ఉండరని నీచ ఆలోచన సార్ వారిది. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా మాతో ఉన్నాయి.
మీరు ఒక్కసారి అవకాశం కల్పిస్తే మీకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఏమి TGSP వాళ్ళ జీతభత్యాలు పెంచమని గానీ DA TA లు పెంచమని గానీ డ్యూటీలు తగ్గించమని గానీ పని భారాన్ని తగ్గించమని గానీ ఎలక్షన్ డ్యూటీస్ కొరకు వేరే రాష్ట్రాలకు పంపవద్దు అని అడుగుతలేము. కానీ సివిలు ఏఆర్ పోలీస్ మాదిరిగానే మాకు కూడా ఫ్యామిలీ కన్వీనెంట్ కల్పిస్తూ TGSP వారిని వారి సొంత జిల్లాలలో ఈ ఏక్ పోలీస్ విధానం అమలు అయ్యేవరకు వారి జిల్లా SP ఆఫీసుఉలకు అటాచ్మెంట్ ఇచ్చి విధులు నిర్వహించేలాగా చూడాలని కోరుతున్నాం.. మా సమస్యలకు బాధలకు ఇబ్బందులకు పరిష్కారం చూపించే విధంగా ఏక్ పోలీస్ విధానాన్ని అమలు పరిచి చీకటి బానిస బతుకుల నుంచి వెలుతురులోకి తీసుకొస్తూ మాకు మా పిల్లలకు బంగారు భవిష్యత్తును కల్పించాలని.. లేకపోతే ఇంకా ఈ బతుకులు మేము బతకలేక బరువెక్కిన హృదయాలతో వేడుకుంటున్నాం.. పెద్ద మనసుతో ఆలోచించి వెంటనే ఏక్ పోలీస్ విధానాన్ని అమలు పరచాలని మా TGSP కుటుంబాలలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం.." అని వారు లేఖలో ఆవేదనభరితంగా రాసుకొచ్చారు.
Also Read : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter