Tirumala Garuda Vahana Seva: తిరుమలలో ఎంతో వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు ఐదో రోజు స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి రూపంలో అనుగ్రహించనున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం గరుడ వాహన సేవ జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత గలిగిన వాహన సేవల్లో గరుడ వాహన సేవకు ప్రత్యేక స్థానం ఉంది.
దాస్యానికి ప్రతిరూపం గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహనం ద్వారా స్వామి వారి దయకు తాము దాసుడని తెలియజేస్తారు. ఈ సేవలో పాల్గొని గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తల విశ్వాసం.
అందుకే బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గరుడ సేవ రోజు తిరుమల మొత్తం అనంత భక్త సాగరాన్ని తలపిస్తుంది. సప్త గిరులు గోవింద నామాలతో మారుమోగుతుంది.
గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి వెలకట్టలేని ఆభరణాలైన మకర కంఠి, సహస్రనామ మాల, లక్ష్మీ హారాలను అలంకరిస్తారు. ముఖ్యంగా స్వామి వారి మూల విరాట్టుకు అలంకరించే హారాలను ఈ రోజు మలయప్ప స్వామికి అలంకరిస్తారు.
అందుకే గరుడ సేవలో స్వామిని దర్శించుకుంటే ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించుకున్నట్లు గానే భావిస్తారు. గరుడ సేవ కోసం తరలి వస్తున్న భక్తులకు తగ్గట్టుగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.