రాఫెల్ ఒప్పందాన్ని ఫ్రాన్స్ దేశంతో చేసుకొనేటప్పుడు భారత ప్రభుత్వం ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది? నిర్ణయాలను తీసుకొనేటప్పుడు ఎవరు చర్చల్లో పాల్గొన్నారు? నిర్ణయాధికారం తీసుకొనేటప్పుడు ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు వహించారు? లాంటి వివరాలతో కూడిన పూర్తిస్థాయి వివరణను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అక్టోబరు 29వ తేదికల్లా తమకు ఆ సమాచారాన్ని మొత్తం అందివ్వాలని కోర్టు తెలిపింది. సీల్డు కవరులో ఈ సమాచారాన్ని అందించాలని తెలిపింది. అయితే ధరలు, టెక్నికల్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో పాటు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి సూచనలు చేసింది. అయితే ఇది కేంద్రానికి పంపిస్తున్న నోటీసు కాదని కూడా కోర్టు తెలిపింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని గతంలో రెండు పిల్స్ కోర్టులో దాఖలైన క్రమంలో న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ కేంద్రం తరఫున కోర్టుతో మాట్లాడుతూ.. పిల్లో కోరిన అంశాలు దేశ భద్రతకు సంబంధించిన వివరాలు కావడం వల్ల.. వాటిని బహిర్గతం చేయలేమని తెలిపారు.
ఈ క్రమంలో ఒప్పందం విషయంలో కేంద్రం అనుసరించిన ధరల విధానం, సాంకేతిక సమాచారం మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని.. అయితే నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అనుసరించిన పద్ధతులను గురించి మాత్రం తెలపాలని కోర్టు తెలిపింది. అక్టోబరు 31వ తేదిన పిల్స్ పై హియరింగ్ ఉంటుందని కూడా కోర్టు తెలిపింది. తమకు అందిన పిటీషన్లలో పేర్కొన్న ఆరోపణలను ఆధారంగా చేసుకొని తాము వివరణ అడగడం లేదని.. కోర్టు ఫార్మాలిటీస్ నిమిత్తం మాత్రమే అడుగుతున్నామని న్యాయస్థానం తెలిపింది. ఎమ్ఎల్ శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.