దేశంలోనే తొలి బాల అమరవీరుడు.. గుర్తుచేసిన సెహ్వాగ్

          

Last Updated : Nov 15, 2017, 02:22 PM IST
దేశంలోనే తొలి బాల అమరవీరుడు.. గుర్తుచేసిన సెహ్వాగ్

చాచా నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాము.. అవునా..! ఆ రోజున సాహసబాలలు గురించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలు గురించి..  చిన్నారుల బోసినవ్వులు గురించి.. ఇలా అన్నీ గుర్తుచేసుకుంటూ ఉంటాము. ప్రభుత్వాలు కూడా అవార్డులు, రివార్డులతో పిల్లలను సత్కరిస్తాయి. ఇవన్నీ బాగానే ఉన్నా.. ఇప్పటివరకూ దేశానికి తెలియని ఒక విషయం కూడా దాగి ఉంది. ఆ విషయాన్ని ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బాలల దినోత్సవం రోజున గుర్తు చేసుకున్నారు. అదేంటో చూద్దాం. 

అది 1938 అక్టోబ‌ర్ 11వ తేదీన జరిగిన సంఘటన. ఒడిశాలోని ధేన్‌క‌న‌ల్ జిల్లా నీల‌కంఠ‌పూర్‌లో జరిగిన యదార్థ సంఘటన. ప్ర‌జామండ‌ల్ "ఆందోళ‌న్"లో భాగంగా బాల‌ల వ‌ర్గంలో స‌భ్యుడైన 12 ఏళ్ల బాజీ రౌత్, బ్రాహ్మ‌ణి న‌ది ప‌డ‌వ‌ల ర‌క్ష‌కుడిగా ఉండేవాడు. బ్రిటీషువారు దేశంలో అమాయ‌కుల‌ను అకార‌ణంగా చంపేస్తున్నార‌ని తెలుసుకున్న బాజీ రౌత్‌ వారి మీద తీవ్ర కోపంతో ఉండేవాడు. ఒకనాడు బ్రిటీష్ బ‌ల‌గాలు బ్రాహ్మ‌ణి న‌ది దాటేందుకు పడవ సహాయం అడగగా, బాజీ రౌత్ అంగీకరించడు. 

దాంతో కోప్పడిన ఒక బ్రిటీషు అధికారి అత‌ని త‌ల‌ వెనుక  వైపు తుపాకి ఎక్కుపెట్టి కాల్చాడు. బాజీ అక్కడికక్కడే చనిపోయాడు. అతనితో పాటు అత‌ని స్నేహితులు ల‌క్ష్మ‌ణ్ మాలిక్‌, ఫాగు సాహూ, హృషీ ప్ర‌ధాన్‌, నాటా మాలిక్‌ల‌ను కూడా బ్రిటీష్ బలగాలు హతమార్చాయి. చనిపోయేవరకు బాజీ రౌత్ నది దాటనివ్వనని వారిని హెచ్చరించాడు.

భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్ వారికి ఎదురుతిరిగి అసువులు బాసిన 12 ఏళ్ల బాజీ రౌత్ వీరత్వాన్ని.. సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో 5 దశలుగా పోస్ట్ చేసి నేటి యువతలో స్ఫూర్తిని నింపాడు. సమాజానికి ఒక తెలియని విషయాన్ని తెలిసేలా చేసాడు. 

 

Trending News