న్యూఢిల్లీ: మైనర్లుగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైనవారు.. ఆ దారుణంపై ఫిర్యాదు చేసుకోవడానికి వీలు కల్పించాలని కేంద్రం భావిస్తోంది. 25 ఏళ్ల వయసు నిండేలోగా ఫిర్యాదు చేసుకొనేలా వీలు కల్పించేలా ప్రస్తుత చట్టాలో కొత్త క్లాజును తెచ్చేలా యోచిస్తోంది. ఇటీవల దీనిపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో చర్చించినట్లు ఓ అధికారి తెలిపారు.
‘‘పోక్సో చట్టంలో ఒక నిబంధనను పెట్టడం లేదా సీఆర్పీసీకి సవరణ తీసుకొచ్చే అంశంపై పరిశీలిస్తున్నాం. దీనివల్ల చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైనవారు.. ఆ దారుణంపై 25 ఏళ్లు నిండేలోపు ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది’’ అని తెలిపారు. కొందరు బాధితులు.. వారిపై జరిగిన దారుణాల గురించి పెద్దయ్యాకే తెలుసుకోగలుగుతారని, అప్పుడే నోరు విప్పగలుగుతారని తెలిపారు.
ప్రస్తుతం నేర శిక్షా స్మృతిలోని 468 సెక్షన్ ప్రకారం ఈ లైంగిక వేధింపులపై మూడేళ్లలోగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ‘న్యాయ ప్రయోజనాల’ దృష్ట్యా లేదా ఆలస్యానికి సరైన కారణాలను వివరిస్తే పాత కేసులనూ కోర్టులు పరిగణనలోకి తీసుకోవచ్చని 473 సెక్షన్ చెబుతోంది. కానీ 18 ఏళ్లు నిండిన బాధితులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.