భద్రతా దళాలను దాటుకుని, వారి హెచ్చరికలను వినిపించుకోకుండా జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని అక్కడి భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్మూలోని భటిండిలోని ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. XUV 500 SUV కారులో వచ్చిన ఆగంతకుడు తొలుత ఇంటి బయట వున్న వీఐపీ గేటు దాటుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. గేటు వద్దే భద్రతాదళాలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని గాయపర్చి ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇంట్లో వస్తు సామాగ్రిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ఇంట్లో బందోబస్తులో ఉన్న సీఆర్పీఎఫ్ 38వ బెటాలియన్ భద్రతా బలగాలు ఆగంతకుడిపై కాల్పులు జరిపి అతడిని హతమార్చాయి.
Man gunned down by security personnel for forcibly entering & vandalising former #JammuAndKashmir chief minister Farooq Abdullah's residence in Jammu in an SUV. pic.twitter.com/YVvSuh698I
— ANI (@ANI) August 4, 2018
భద్రతా బలగాల కాల్పుల్లో మృతిచెందిన ఆగంతకుడిని పూంచ్ జిల్లాకు చెందిన ముర్ఫస్ షాగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన జమ్మూ ఏఎస్పీ వివేక్ గుప్తా ఘటన జరిగిన తీరు తెన్నులను మీడియాకు వివరించారు. జమ్మూ రేంజ్ ఐజీ ఎస్డీ సింగ్ జామ్‌వాల్ మీడియాతో మాట్లాడుతూ ఆగంతకుడి వద్ద మారణాయుధాలు లేవని, కేసు దర్యాప్తులో మిగతా వివరాలు వెల్లడయ్యే అవకాశం వుందని అన్నారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.