కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో యశోమతి థాకూర్‌కి ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పగిస్తూ ఆమెని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ. థాకూర్ని కర్ణాటక ప్రధాన కార్యదర్శి ఇంచార్జ్ కే.సీ. వేణుగోపాల్‌కి ఎటాచ్ చేస్తున్నట్టుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలోని టియోసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన యశోమతి థాకూర్ వృత్తిరీత్యా ఓ న్యాయవాదిగానూ పనిచేశారు. పార్టీలో యువ నాయకత్వానికి కీలక బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ చొరవ తీసుకుని మరీ ఆమెను ఈ స్థానంలో నియమించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ఏఐసీసీ ఇంచార్జ్‌గా రాజీవ్ సతవ్, ఒడిషా ఏఐసీసీ ఇంచార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌ల నియామకం కూడా అటువంటిదే అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక అశోక్ గెహ్లట్ విషయానికొస్తే, రెండున్నర దశాబ్ధాల పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగిన జనార్థన్ ద్వివేది స్థానంలో గెహ్లాట్ నియామకం అవడం సైతం రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది.