RAM Rapid Action Mission Review: ప్రతీ వారం కమర్షియల్ చిత్రాలు లెక్కలేనన్ని వస్తుంటాయి. దేశ భక్తికి కమర్షియల్ అంశాలను జోడించి అందరినీ ఆకట్టుకునే చిత్రాలు తీయడం అంటే మాములు విషయం కాదు. తొలి ప్రయత్నంలోనే హీరో, దర్శక, నిర్మాతలు రామ్ సినిమాతో ఆ సాహసం చేశారు. పేట్రియాట్రిక్ జానర్లో తీసిన ఈ మూవీ రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు లెక్కచేయకుండా దేశం కోసం వీర మరణం పొందుతాడు. తమ కోసం మరణించాడంటూ మరో మేజర్ జేబీ (భాను చందర్) ఆ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. మేజర్ సూర్య ప్రకాష్ కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల) మాత్రం దేశానికి సేవ చేయడం అంటే ఇష్టం ఉండదు. దేశానికి సేవ చేస్తూ తన తండ్రి చనిపోతే దిక్కులేని వాళ్లం అయ్యామని, చిన్నతనంలోనూ నాన్న తనతో ప్రేమగా ఉండలేకపోయాడంటూ కోపంతో ఉంటాడు రామ్. అలాంటి రామ్‌ను సూర్య ప్రకాష్ కోరిక మేరిక డిపార్ట్మెంట్లోకి జాయిన్ చేయించడానికి జేబీ చేసిన ప్రయత్నాలు ఏంటి? జేబీ కూతురు జాహ్నవి (ధన్య బాలకృష్ణ)కు ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఏంటి? ఉగ్ర సంస్థల కుట్రను చివరకు రామ్ అడ్డుకున్నాడా? దేశభక్తి అసలే లేని రామ్.. చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిగా ఎలా మారాడు? అన్నదే కథ.
నటీనటులు
రామ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటిస్తాడు. దేశభక్తి అంటే గిట్టని, అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడిలా కనిపించినప్పుడు.. దేశ భక్తితో ఎదిగిన ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు చూపించే వ్యత్యాసం ఆకట్టుకుంటుంది. ఆ రెండింటికీ చాలా వ్యత్యాసం చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త అల్లరి చిల్లరగా, పిచ్చి జుట్టు వేసుకున్నట్టుగా.. అమ్మాయి ప్రేమ కోసం తిరిగే ఓ సాధారణ కుర్రాడిలా కనిపిస్తాడు. ద్వితీయార్దంలో మాత్రం దేశం కోసం ప్రాణాలిచ్చే సిన్సియర్ ఆఫీసర్‌గా సీరియస్ పాత్రలోనూ అలరించారు. యాక్షన్ ఎమోషన్ కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ సూర్య ఆకట్టుకున్నాడు. ఇక మొదటి సినిమా అన్న బెరుకు ఎక్కడా లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లోనూ కుమ్మేశాడు. రోహిత్ చాలా రోజులకు మంచి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి కనిపించిన రియల్ హీరోలా మారాడు. భానుచందర్ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. సాయి కుమార్, శుభలేక సుధాకర్ తమ అనుభవాన్ని చూపించారు. మరీ ముఖ్యంగా సాయి కుమార్ చెప్పిన డైలాగ్స్ రొమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. హీరోయిన్ ధన్యా బాలకృష్ణ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. భాషా కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు మెప్పిస్తాయి.
విశ్లేషణ
రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న కోర్ పాయింట్ పాతది. కానీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం కొత్తగా ఉంటుంది. ప్రతీ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్ లోపల, సీక్రెట్ స్లీపర్స్ అంటూ ఇలా ఎన్నో కాన్సెప్టుల మీద సినిమాలు వచ్చాయి. కానీ బ్యూరో క్రాటిక్ జిహాద్ అనే కొత్త పాయింట్‌ను టచ్ చేశాడు. సిన్సియర్ ముస్లిం ఆఫీసర్ పాత్రను పోషించిన సాయికుమార్‌తో ఆ పాయింట్‌ను మరింత బలంగా చెప్పించడంలో, ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్‌కు సంబంధించి కొన్ని సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల రామ్, ఫ్రెండ్ కారెక్టర్ చేసిన భాష నవ్వులు పూయిస్తారు. అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. ఆఫీసర్‌గా మారే క్రమంను ఫస్ట్ హాఫ్‌లో చక్కగా చూపించారు. సెకండాఫ్‌లో ఫుల్ ఎమోషనల్‌గా సాగుతుంది. ధన్య బాలకృష్ణ చేసిన ఎమోషనల్ సీన్ సెకండాఫ్‌లో అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
శుభలేక సుధాకర్ పాత్రతో ఉగ్రవాదానికి, రాజకీయానికి ఉన్న కనెక్షన్, చరిత్రకి రాజకీయానికి ఉన్న కనెక్షన్‌ను చక్కగా చూపించారు. సెకండాఫ్ పూర్తి సీరియస్ మోడ్‌లో దేశ భక్తి కోణంలో నడిపించాడు. మిహిరాం క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. ప్రతీ ఒక్క భారతీయుడికి ఈ సీన్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. త్రివర్ణ పతాకం కనిపించే షాట్, దేశ భక్తిని, మత సామరస్యాన్ని చాటేలా చివర్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేలా చూపించే షాట్.. హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సాయం చేసే సీన్‌కు దండం పెట్టాల్సిందే. భారత్ మాతాకి జై అని తెరపై అంటే.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకి సైతం ఆ వైబ్ వచ్చేలా చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
రామ్ సినిమాలో టెక్నికల్ టీం కొండంత అండగా నిలబడింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది. ధారన్ సుక్రి విజువల్స్, ఆయన టాలెంట్ చెప్పాలంటే క్లైమాక్స్ షాట్స్ చాలు. అద్భుతమైన కెమెరా వర్క్ కనిపిస్తుంది. మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాత కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలా ఉంది.
రేటింగ్: 2.75