Itlu Maredumilli Prajaneekam Movie Review: ఒకప్పుడు కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఆ తర్వాత తన జానర్ మార్చుకున్నాడు. నాంది సినిమాతో ఒక్కసారిగా సీరియస్ సబ్జెక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. అల్లరి నరేష్ నుంచి అలాంటి సబ్జెక్ట్ రావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా సీరియస్గా తీసుకుని ఆ సినిమా హిట్ చేశారు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మరో సబ్జెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు నరేష్.
నవంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. జీ స్టూడియోస్- రాజేష్ దండా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? అనేది సినిమా రివ్యూలో చూసి తెలుసుకుందాం.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కథ ఏమిటంటే
శ్రీపాద శ్రీనివాసరావు( అల్లరి నరేష్) ఒక తెలుగు ఉపాధ్యాయుడు. సాధారణంగా తెలుగంటేనే చిన్న చూపు అయిపోతున్న ఈ రోజుల్లో తెలుగు ఉపాధ్యాయుడు అంటే కూడా చిన్న చూపే కదా అంటూ తనలో తాను బాధపడుతూ తెలుగుని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు.
అయితే ఎలక్షన్ డ్యూటీలో భాగంగా ఇంగ్లీష్ టీచర్ (వెన్నెల కిషోర్)తో కలిసి మారేడుమిల్లి అనే ఒక అటవీ ప్రాంతంలో అక్కడి ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం మూడు రోజులు ముందే వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన శ్రీనివాసరావుకు అక్కడ లచ్చిమి(ఆనంది) ఊరి పెద్ద(కుమరన్) ఖండా(శ్రీ తేజ్) వంటి వారు పరిచయం అవుతారు.
అయితే అసలు ఎన్నికలే వద్దు ఒక్క ఓటు కూడా వేయకూడదు అనుకుంటున్న ఆ ఊరి ప్రజలను శ్రీనివాసరావు దగ్గరుండి అవగాహన కల్పించి ఓట్లు వేయిస్తాడు కానీ ఆ ఓట్ల వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్న ఊరి ప్రజలు శ్రీ నివాసరావుని వెనక్కి పంపారా? శ్రీనివాసరావు ఎందుకు ఊరి వాళ్ళతో కలిసి పోరాడాల్సి వచ్చింది. చివరికి ఊరి ప్రజలందరూ కలిసి పోరాడిన పోరాటం ఫలించిందా? లేదా? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
సాధారణంగా సుదూర ప్రాంతాల ప్రజలు తమ కనీస అవసరాల కోసం పోరాడుతూ ఉంటారని మనం రోజు వార్తల్లో వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అలాంటి కథనే కథాంశంగా తీసుకున్నాడు దర్శకుడు ఏఆర్ మోహన్. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన తీసుకున్నది చిన్న పాయింట్ అయినా ఎక్కడికక్కడ ట్విస్టులతో కూడి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆ కథను మలిచారు. ఒక మారుమూల అటవీ ప్రాంతంలోని ప్రజలు తమకు కనీస అవసరాలు అయిన విద్య, వైద్యం, రవాణా వంటివి కోరుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి ఆ ప్రభుత్వాధికారులనే నిర్బంధిస్తే ఎలా ఉంటుంది? అనే లైన్ తో ఈ సినిమా రాసుకున్నారు.
వాస్తవానికి మనం విద్యుత్ లైన్మెన్ నిర్బంధం, ప్రభుత్వ డాక్టర్ నిర్బంధం లాంటి కథనాలు వార్తల్లో చూస్తూనే ఉంటాం. బహుశా దర్శకుడు వాటిని చూసే ప్రేరణ పొంది ఉండవచ్చు కానీ సినిమాని ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా చూపించడంలో దాదాపుగా దర్శకుడు సఫలమయ్యాడు. అయితే అనునిత్యం మనం వార్తల్లో చూసే వాటినే సినిమాలో కూడా చూపడం ప్రేక్షకుల సహనానికి పరీక్షే, అలాగే కొన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి, అవి పక్కన పడితే సినిమాలో కొన్ని ఆసక్తికర పాయింట్స్ ఉన్నాయి. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా అటు ఎమోషన్స్, ఇటు కామెడీ, మరోపక్క లవ్ ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఓవరాల్ గా ఒక పాయింట్ గా చూసుకుంటే చిన్నదే కానీ సినిమా మాత్రం ఆకట్టుకునే విధంగా సాగింది.
నటీనటులు
గతంలో కేవలం కామెడీ పాత్రలకే పరిమితమైన అల్లరి నరేష్ నాంది సినిమాతో తనలో ఉన్న నటుడిని బయట పెట్టారు. ఈసారి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో తనలో ఉన్న నటుడిని మరో లెవెల్ కి తీసుకు వెళ్లారు. కేవలం కామెడీ హీరోగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన ఆయన తనలో ఇంత సీరియస్ యాక్టర్ ఉన్నాడనే విషయాన్ని ఈ సినిమాతో పరిచయం చేసినట్లయింది. ఇక ఆనంది ఒక అటవీ ప్రాంతపు యువతి పాత్రలో జీవించింది. తెలుగమ్మాయి కావడంతో ఈ పాత్రకు ఆమె కరెక్ట్ గా సూట్ అయినట్టు అనిపించింది.
ప్రవీణ్, వెన్నెల కిషోర్, రఘుబాబు వంటి వారి కామెడీ ట్రాక్ బాగా పండింది, అల్లరి నరేష్ టైమింగ్ కూడా వీరికి కలవడంతో అందరూ కలిసి నవ్వులు పుట్టించారు. ఇక కుమరన్, శ్రీతేజ్, కామాక్షి భాస్కరాల వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసే విధంగా నటించారు. సంపత్ రాజ్ కూడా కలెక్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఒక సీన్ లో అయితే సంపత్ కళ్ళతోనే నటించి మెప్పించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీం
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు ఏఆర్ మోహన్ గతంలో తమిళ సినిమాలు చేసినా తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా. అయినా ఎక్కడా తొట్రు పడకుండా సుదీర్ఘ అనుభవం ఉన్న దర్శకుడిలా తెలుగు ప్రేక్షకులు మెచ్చే సినిమా తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా కథ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది, నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా సాగింది.
కొన్ని పాటలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ కెమెరా పనితనంతో మనల్ని నిజంగానే అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లిపోయారా అన్నట్లుగా సినిమా మొత్తం సాగుతుంది. ఇక ఇప్పటివరకు ఎక్కడో కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలు చూసిన మనకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత సుందరమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయా అనిపించే విధంగా విజువల్స్ ఉన్నాయి. ఇక ఈ ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది.
ఫైనల్ గా
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఒకరకంగా డాక్యుమెంటరీ ఫిలింలా ఉంటుందని అనుకున్నా, తెలుగు కమర్షియల్ సినిమాకి కావలసిన అన్ని ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగిన మూవీ ఇది.
Rating : 3/5
Also Read: Thodelu Movie Review: వరుణ్ థావన్ 'తోడేలు' కాటు వేసిందా?.. సినిమా ఎలా ఉందంటే?
Also Read: Veera Simhaa Reddy First Single : పగిలిపోయిందని చూపించిన తమన్.. అది దేవి శ్రీ ప్రసాద్‌కు కౌంటరా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook