ఉత్తరాంధ్రలో సిరిమానోత్సవం ప్రారంభం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం ఈ రోజు విజయనగరంలో ఘనంగా ప్రారంభం కానుంది. 

Last Updated : Oct 23, 2018, 01:56 PM IST
ఉత్తరాంధ్రలో సిరిమానోత్సవం ప్రారంభం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం ఈ రోజు విజయనగరంలో ఘనంగా ప్రారంభం కానుంది. తర తరాలుగా సంప్రదాయంగా వస్తున్న ఈ ఉత్సవంలో భాగంగా ఆలయపూజారి ఇంటి నుండి ప్రారంభమయ్యే జాతర.. సిరిమాను రథంతో సహా కన్యకాపరమేశ్వరి ఆలయం మీదుగా అమ్మవారి చదురుగుడి వద్దకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయ వ్యవస్థాయపక ధర్మకర్తలైన పూసపాటి వంశం వారు తల్లికి పీతాంబరాలు సమర్పిస్తారు. ప్రతీ సంవత్సరం దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ ఉత్సవాలు ఘనంగా విజయనగరంలో ప్రారంభమవుతాయి.

ఈ సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారి కోసం అంజలి రథం, తెల్లని ఏనుగును తయారీ చేస్తారు. ప్రతీయేటా ఈ సిరిమానోత్సవాన్ని వీక్షించడానికి లక్షలమంది భక్తులు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒడిశా, రాజమండ్రి ప్రాంతాల నుండి తరలివస్తుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా చింతమానును సిరిమానుగా మలిచి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. 

ఈ ఉత్సవంలో ప్రధానమైనది తోలేళ్ళ ఘట్టం. ఈ ఘట్టం తర్వాత అమ్మవారి పూజాఘట్టం ఉంటుంది. ఈ సిరిమానోత్సవం ప్రారంభానికి నాలుగు రోజుల మునుపు.. పూజారి కలలోకి అమ్మవారు వచ్చి ఈసారి మాను ఉండే ప్రదేశం పేరు చెబుతుందని అంటారు. ఈసారి సిరిమానోత్సవంలో భాగంగా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 250 సీసీ టీవి కెమెరాలను అమర్చి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నామని ఈ ఉత్సవం సందర్భంగా కమీషనర్ తెలిపారు.  మంగళవారం ఉదయం 11 గంటలు సమయంలో సిరిమానును హుకుంపేటలో బయలుదేరి  ఆ తర్వాత పుచ్చల వీధి, కన్యాకాపరమేశ్వరి ఆలయం, గంటస్థంభం మీదుగా పైడితల్లి అమ్మవారి ఆలయానికి మంగళ వాయిద్యాల నడుమ చేరుకోనుంది. 

Trending News