BJP State Executive Meeting At Champapet: తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని.. దీనిని దృష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజిన్ సర్కారుంటేనే తెలంగాణలో డబుల్ అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతోపాటు తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని చంపాపేటలో సోమవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం తథ్యం అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంతోపాటు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నా.. కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వంతో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న నిధులను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో భారత్ విశ్వగురు స్థానానికి ఎదుగుతోందన్నారు. రైతు వేదికలు, హరితహారం, శ్మశాన వాటికలు సహా పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే జరుగుతోందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఆయన వివరించారు.
"తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే.. ఇంకా ఎక్కువ లాభం జరిగేది.. కేంద్ర ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ బీమా పథకాన్ని ఇక్కడ అమలు చేయడం లేదు. అది అమలైతే ప్రతి పేదవాడు రోగమొస్తే 5 లక్షల వరకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసుకునే వీలుండేది. అలాగే గత నాలుగేళ్లుగా ఫసల్ బీమా అమలు చేయడంతో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సాయం అందడం లేదు. ఒకవేళ ఈ పథకం అమలైతే దాదాపు 30 వేల కోట్లకుపైగా రైతులకు సాయం అందేది.
బీఆర్ఎస్ సర్కార్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడు. ఒకనాడు మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇయాళ అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నాడు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నాడు. కేసీఆర్ లాంటి నీచుడిని, విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు.. కేసీఆర్ ఎంతటి విశ్వాసఘాతకుడంటే మొన్నటి కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌ను మోసం చేసిండు.. తెలంగాణ కోసం మొదటి నుంచి నిలబడి కలబడి పార్లమెంట్ బిల్లు పాస్ చేయించిన సుష్మా స్వరాజ్‌ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించిన నీచుడు.. 2004లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఆ పార్టీని.. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బయటకొచ్చి ఆ పార్టీని మోసం చేసిండు.. 2004లో కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలని, సూది దబ్బడం పార్టీలని తిట్టిన నోరే.. ఇయాళ తన అవసరం కోసం కమ్యూనిస్టు పార్టీలను చంకనేసుకుని తిరుగుతున్నాడు.." అని బండి సంజయ్ అన్నారు.
గెలవలేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులకు కేసీఆర్ ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారని.. ఆ పార్టీకి సొంతంగా అధికారం రాదని తేలిపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పాకెట్ మనీ పేరుతో ఎన్నికల ఫండింగ్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే వాళ్లంతా బీఆర్ఎస్‌తో కలిసి అధికారం పంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని.. మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యలో పేదల రాజ్యాన్ని స్థాపించడం ఖాయమన్నారు.
Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?
Also Read: Avinash Reddy Arrest: కర్నూలులో హై టెన్షన్, ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డి అరెస్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook