Telangana Govt Teachers: రాష్ట్రంలో స్పౌజ్ టీచర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. చాలారోజులుగా ఎదురుచూస్తున్న బదిలీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పంపించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.
గత ప్రభుత్వం జీవో 317 ఇవ్వగా.. చాలామంది భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. దీంతో స్పౌజ్ కేటగిరీలో కొందరికే న్యాయం జరగ్గా.. మరికొందరిని మాత్రం ఒకే జిల్లాకు అలాట్ చేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్పౌజ్ బాధిత టీచర్లు మరోసారి సర్కారు దృష్టికి తీసుకువెళ్లారు.
ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఫైల్ వేగంగా ముఖ్యమంత్రి వద్దకు చేరింది.
సీఎం రేవంత్ రెడ్డి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 834 స్పౌజ్ టీచర్లకు లబ్ధి చేకూరనుంది. మ్యూచువల్ టీచర్ల ట్రాన్స్‌ఫర్‌పై ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని DEO లను అధికారులు ఆదేశించారు.
స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి PRTU రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి, పర్వతి సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు.