తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ రైళ్లు ... మూడే మూడు గంటల్లో చెన్నైకి వెళ్లొచ్చు !

Last Updated : Oct 11, 2017, 01:47 PM IST
తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ రైళ్లు ... మూడే మూడు గంటల్లో చెన్నైకి వెళ్లొచ్చు !

చెన్నై- కాజీపేట మధ్య దూరం 649 కిలోమీటర్లు. రైలు ప్రయాణానికి పట్టే సమయం సుమారు 11 గంటలు. అయితే భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కేవలం 3 గంటల్లో గమ్యానికి చేరుకోవచ్చు. ఇది నమ్మసక్యంగా లేదు కదూ.. వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది...

జర్మనీతో రైల్వేశాఖ ఒప్పందం..

దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడంలో ముందడుగు పడింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా  కాజీపేట నుంచి  చెన్నై వరకు కేవలం 3 గంటల్లో చేరుకునేలా ప్రళాళికలు రచిస్తున్నారు. 200 కిలోమీటర్ల వేగంతో రైళ్ల రాకపోకలు సాగించే విధంగా మార్గాన్ని బలోపేతం చేసే అంశంపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి.. సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేందుకు మన రైల్వేశాఖ జర్మనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కాగా అధ్యయనానికి అయ్యే వ్యయాన్ని ఇరువర్గాలు సమాన నిష్పత్తిలో భరిస్తాయి. రైల్వే అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవడానికి 2016లో జర్మనీలో రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. అందులో భాగంగా ప్రస్తుతం చెన్నై-కాజీపేట మార్గం అభివృద్ధిపై అధ్యయనం చేపట్టడానికి ఒప్పందం జరిగింది.

3 దశల్లో అధ్యయనం ..

తాజా ఒప్పందం ప్రకారం చెన్నై - కాజీపేట మధ్య ఉన్న కారిడార్‌లో సెమీ హైస్పీడ్‌ రైళ్ల రాకపోకలు సాగించే విధంగా ఇప్పుడున్న మార్గాన్ని అభివృద్ధి చేయడం ఎలా అన్న అంశంపై అధ్యయనం నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన అధ్యయనం 3 దశల్లో 22 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యయనంలో భాగంగా సెమీ హైస్పీడ్‌ రైళ్లు నడపటానికి ఉన్న వెసులుబాటు ఎంత? ఆర్థిక ప్రభావం ఏ మేరకు ఉంటుంది? కొత్తగా నిర్మాణ పనులు చేపట్టడానికి అనుసరించాల్సిన విధానం ఎలా ఉండాలి? ఆర్థిక వనరుల సమీకరణ ఎలా అన్న అంశాలపై ప్రాథమికంగా అధ్యయనం చేస్తారు. అధ్యయనం పూర్తయిన వేంటనే దాన్ని కార్యాచరణ సిద్ధం చేస్తారు.

Trending News