AP Govt Orders To Ticket Price Hike For Thandel Movie: విడుదలకు సిద్ధమైన తండేల్ సినిమా బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. సినిమా టికెట్ ధరలు ఎంత పెంచిందో తెలుసుకుందాం.
హ్యాట్రిక్‌గా మరోసారి జోడీ కట్టిన అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి 'తండేల్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. తండేల్ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.75 పెంచుకోవడానికి అవకాశం ఇస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
తండేల్ సినిమా విడుదలైన వారం రోజుల వరకు పెంచిన ధరలు కొనసాగుతాయి. అంటే ఫిబ్రవరి 14వ తేదీ వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో తెలంగాణలో కూడా ప్రభుత్వం టికెట్లు పెంచే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమా బృందానికి భారీ లబ్ధి చేకూరనుంది.
మత్య్సకారుల జీవితం నేపథ్యంలో తండేల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నారు.