Sankranthi Movies 2025: సంక్రాంతి పండగ అంటే కోడి పందాలు, పూర్ణకుంభాలు, మంచి వంటకాలు మాత్రమే కాదు, పెద్ద హీరోల తెలుగు సినిమాల విడుదలతో కూడి.. సినీ ప్రేక్షకులు బాగా ఎదురుచూసే సీజన్. సంక్రాంతి పండగ తెలుగు చిత్ర పరిశ్రమకు అతి ముఖ్యమైనది. ఈ సీజన్లో పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదల అవుతూ భారీ కలెక్షన్లను సాధించడం సాధారణమే. అయితే కొన్ని మాత్రం డిజాస్టర్ గా నిలుస్తాయి.
ఈ ఏడాది సంక్రాంతికి..తెలుగులో మూడు పెద్ద సినిమాలు.. ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలోకి దిగాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కానీ, భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే, కథనంలో వైవిధ్యం లేకపోవడం, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటం, మరింతగా సెకండాఫ్‌లో నెమ్మదిగా సాగడం వంటి కారణాలతో సినిమా నెగిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.
చిత్రం తొలి రోజు రూ.51 కోట్ల వసూళ్లను సాధించినప్పటికీ, రెండో రోజు కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. శనివారం రోజున రూ.21.6 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించగా, మూడవ రోజు ఆదివారం రూ.17 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. మొత్తం ఆరు రోజుల్లో గేమ్ ఛేంజర్ కలెక్షన్లు రూ.110.03 కోట్లకు మాత్రమే చేరాయి. సినిమా నిర్మాణానికి రూ.450 కోట్ల బడ్జెట్ వెచ్చించినందున, దాదాపు రూ.250 కోట్ల నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా సాంకేతికంగా ఉన్నతమైనప్పటికీ, కథలోని మూసపద్ధతులు, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై పెద్దగా స్పందించలేదు. ఇది సినిమాను మరింతగా ప్రభావితం చేసింది.
కాగా ఇలా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ, గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల మెప్పు పొందడంలో విఫలమైంది. సంక్రాంతి సీజన్లో ఇంత భారీ ఫ్లాప్ రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దెబ్బ.