భూటాన్ లో పిల్లల పార్లమెంట్

Last Updated : Nov 6, 2017, 12:42 PM IST
భూటాన్ లో పిల్లల పార్లమెంట్

ఇదివరకు ఆ దేశం అంటూ ఒకటుందని తెలీదు.. కానీ నేడు సాంకేతికత, ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి ఆ దేశం గురించి తెలిసింది. వ్యవసాయం, పర్యాటకమే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. వాటితోనే ప్రపంచంలో అభివృద్ధి పథంవైపు ముందుకు వెళుతోంది. ఆ దేశమే... భూటాన్.   

భూటాన్ గురించి ఇతర దేశాలతో పోలిస్తే మనం కాస్త బెటర్. వారు పండించే పంటలను మనమే ఎక్కువగా కొంటున్నాం. అటవీసంపద, పర్యాటకం, జలవిద్యుత్ ఉత్పత్తులను భారత్ కు అమ్మడం పైనే భూటాన్ ఆర్ధికరంగం ఆధారపడి ఉంది. కాబట్టి మనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. 

అయితే మనక్కూడా తెలీని ఒక విషయం భూటాన్ లో ఉంది. అదే.. విద్యారంగం. అక్కడి బడులకి ఓ ప్రత్యేకత ఉంది! సాధారణంగా మనదేశంలో పిల్లల్ని రాజకీయాలకు దూరంగా ఉంచుతారు. కానీ భూటాన్‌ లో అలా కాదు. అక్కడి పిల్లలు రాజకీయాలు నేర్చుకోవాలని ప్రభుత్వమే భారీగా డబ్బులు ఖర్చుచేస్తుంది. ప్రతి బళ్లోనూ పిల్లల ‘ప్రజాస్వామ్య సంఘాలు’ ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా పిల్లల పార్లమెంటు సభ్యులని ఎన్నుకుంటారు. 

ఈ తతంగాన్నంతా నడిపేది ఆ  దేశ ఎన్నికల కమీషనే.  వారే ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఈవీఎంలను ఏర్పాటు చేస్తారు. ఎన్నికల అధికారిని, రైటర్నింగ్ అధికారిని, సిబ్బందిని ఇలా అందరినీ నియమిస్తారు. పోయిన ఏడాది జరిగిన ఎన్నికలకి పద్నాలుగు లక్షలు ఖర్చు చేశారట ఎన్నికల కమీషన్. ఎన్నికైన పిల్లల పార్లమెంట్ సభ్యలందరికీ అధికారాలు ఉంటాయి. అయితే వీళ్లు విద్యకు సంబంధించిన సమస్యలు, అంశాలు వాటిపై మాత్రమే గళం విప్పుతారు. వీరు ఏకంగా నిజమైన పార్లమెంటు స్పీకర్‌కి నివేదికలు పంపవచ్చు, నేరుగా వెళ్లి మాట్లాడవచ్చు. 

 మన దేశంలో కూడా ఇలాంటి విధానమే ఉంటే ఎంచక్కా మన విద్యారంగ సమస్యలపై ఏకంగా పార్లమెంట్ సాక్షిగా గళంవిప్పే అవకాశం దొరుకుతుంది.

Trending News